మూడో పంటకు రైతుల సన్నాహాలు
మంచి ధర కోసం చర్యలు
జనగామ: రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఏడాదికి మూడు పంటలు సాగు చేసే ప్రత్యేకత జిల్లాకు ఉంది. ఇందులో భాగంగా వానాకాలం పంటల నాట్లు పూర్తయిన కొద్ది రోజులకే కత్తెర పంట కోతలు ప్రారంభం కావడం రైతుల వ్యవసాయ ప్రణాళికలో మరో విశేషంగా నిలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో పలు ప్రాంతాల్లో కత్తెర పంట కోతలు ప్రారంభమై, ధాన్యం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌కు చేరుతోంది. జిల్లాలో కత్తెర సాగు దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయంగా ఉంది. వందేళ్లుగా ఈ విధానంలో పంటలు సాగు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. యాసంగి పంట కోతలు పూర్తయిన మడులను వెంటనే దున్ని కత్తెర సాగుకు సిద్ధం చేస్తారు. సాధారణంగా ఏప్రిల్ చివరి వారం నుంచే కత్తెర పంట సాగు పనులు ప్రారంభమై, మే రెండో వారం నుంచి మూడో వారంలోపు నాట్లు పూర్తి చేస్తారు. అనంతరం పంట కాలం ముగియగానే కోతలు చేపడతారు.
30 నుంచి 35 వేల ఎకరాల్లో సాగు
ప్రస్తుత వానాకాలం సీజన్‌లో జిల్లాలో సాధారణ వరి సాగు విస్తీర్ణం సుమారు 2.08 లక్షల ఎకరాలు కాగా, సుమారు 1.74 లక్షల ఎకరాల్లో సాగైనట్లు అంచనా. ఇందులో 30 నుంచి 35 వేల ఎకరాల వరకు కత్తెర పంట సాగయ్యే అవకాశం ఉంది. లింగాలఘణపురం, రఘునాథపల్లి, పాలకుర్తి, జనగామ తదితర మండలాల్లో కత్తెర సాగు విస్తారంగా కనిపిస్తోంది.
భూగర్భ జలాలే ప్రధాన ఆధారం
కత్తెర పంట సాగు సమయంలో జిల్లా వ్యాప్తంగా వానాకాలం వ్యవసాయ పనులు కొనసాగుతుండటంతో ఒకేసారి భారీగా సాగునీటి వినియోగం ఉండదు. దీంతో భూగర్భ జలాలపై ఒత్తిడి పెద్దగా ఉండకపోవడంతో బోర్లు, బావుల ద్వారా కత్తెర పంటకు అవసరమైన నీటిని అందించుకునే అవకాశం రైతులకు ఉంటుంది. నీటి లభ్యతతో పాటు పంటల సాగు సమయం కూడా అనుకూలంగా ఉండటంతో చీడపీడల ప్రభావం తగ్గి దిగుబడులు పెరిగే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు.
మార్కెట్‌లో క్వింటాకు రూ.2,321
కత్తెర ధాన్యం కోతలు ప్రారంభమైన నేపథ్యంలో రైతులు పంటను వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. రెండు రోజుల క్రితం మార్కెట్‌లో కత్తెర ధాన్యం క్వింటాకు గరిష్టంగా రూ.2,321 ధర పలికింది. ప్రస్తుతం మార్కెట్‌కు కత్తెర ధాన్యం పరిమితంగా వస్తుండటంతో, రానున్న రోజుల్లో నాణ్యమైన ధాన్యానికి మరింత ధర లభించే అవకాశాలపై రైతుల్లో ఆశలు నెలకొన్నాయి.
30 నుంచి 35 వేల ఎకరాల్లో సాగు
ఏడాదికి మూడు పంటలు జిల్లా ప్రత్యేకత
మార్కెట్‌కు చేరుతున్న ధాన్యం
క్వింటాకు రూ.2,321 ధర
జిల్లా వ్యవసాయ మార్కెట్‌కు ప్రస్తుతం కత్తెర ధాన్యం భారీగా వస్తోంది. రైతులు తీసుకొచ్చిన ధాన్యానికి నాణ్యతను బట్టి సరైన ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. కొనుగోలు సమయంలో రైతులకు నష్టం జరగకుండా మార్కెట్ సిబ్బంది పర్యవేక్షణ చేస్తున్నారు. నాణ్యతను నిర్ధారించి, పోటీ ధర వచ్చేలా వ్యాపారులతో సమన్వయం చేస్తున్నాం. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా మార్కెట్‌కు ధాన్యం తీసుకురావాలి. –బనుక శివరాజ్ యాదవ్, చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ


