బచ్చన్నపేట : ఎరువుల దుకాణాల్లో క్రయ, విక్రయాల నమోదు తప్పనిసరి అని, కొనుగోలు చేసిన రైతులకు తప్పకుండా బిల్లులు ఇవ్వాలని జిల్లా వ్యవసాయ అధికారి అంబికాసోనీ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేసి స్టాక్ రిజిస్టర్‌లను పరిశీలించారు. అలాగే మండలంలోని చిన్నరామన్‌చర్ల గ్రామంలో జరుగుతున్న డిజిటల్ క్రాప్ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు చేసిన 7 రకాల సన్నరకాలను ఆన్‌లైన్ చేసుకోవాలని దీనికి ఈ నెల 10 చివరి గడువు అన్నారు. ఆయా గ్రామాల్లో వలంటీర్లు డిజిటల్ క్రాప్ సర్వేను కచ్చితత్వంతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ బజ్జూరి దివ్య, ఏఈఓ రాకేష్, అజయ్, రైతులు పాల్గొన్నారు.
13న జిల్లాస్థాయి
కబడ్డీ ఎంపికలు
జనగామ రూరల్: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాల, బాలికలు సబ్–జూనియర్ బాలికల జిల్లా స్థాయి కబడ్డీ జట్ల ఎంపికలు ఈ నెల 13న (ఆదివారం) ఉదయం 09:00 గంటలకు జిల్లా కేంద్రంలోని మైనార్టీ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ (గీతాంజలి స్కూల్ పక్కన) నిర్వహించనున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా చైర్మన్ పోగుల సారంగపాణి, జిల్లా అధ్యక్షుడు వై.కుమార్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికై న జూనియర్ బాలురు, సబ్–జూనియర్ బాలికలు ఈ నెల 26నుంచి 29వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే అంతర్ జిల్లా కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. అలాగే జూనియర్ బాలికల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో వచ్చే నెల 9 నుంచి 11వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, 10వ తరగతి మెమో జిరాక్స్ కాపీలతో రావాలని కోరారు. మరిన్ని వివరాలకు రాజు– 8179650006, సుధాకర్ 9391549744, కుమార్ 8328211430, రాజన్న – 9494130323 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.
విద్యుత్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గం
జనగామ: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ కార్యవర్గ 327 ఎన్నికలు రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం ఐలేష్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా బి.వీరాంజనేయులు, కార్యదర్శిగా చెట్టిపల్లి నరేందర్‌రెడ్డి, సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి.రాజ్‌కుమార్ ఎన్నికయ్యారు. ఎన్నికలను సంఘం సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ పర్యవేక్షించగా, ఎన్నికల అధికారులుగా పి.మహిందర్‌రెడ్డి, కె.శ్రీనివాసరావు వ్యవహరించారు. జనగామ డివిజన్ అధ్యక్షుడిగా మూల మహేందర్, కార్యదర్శిగా కోతి విజయకుమార్, స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ అధ్యక్షుడిగా బి.శ్రీధర్, కార్యదర్శిగా ఫయాజ్, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.
బతుకమ్మ ఆడి నిరసన
స్టేషన్‌ఘన్‌పూర్: పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే జీఓ 97ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఘన్‌పూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు మంగళవారం కళాశాల ఆవరణలో బతుకమ్మ ఆట ఆడి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని, జీఓ 97తో పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను శక్తి ఫ్రేమ్‌వర్క్ కింద విలీనం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం పునఃపరిశీలించాలని, విద్యార్థులు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


