● చైర్‌పర్సన్‌పై అనుచిత వ్యాఖ్యలు
చేశారని కాంగ్రెస్ కౌన్సిలర్ల నిరసన
● బీఆర్‌ఎస్ సభ్యుల వాకౌట్
● వచ్చే సమావేశానికి బీఆర్‌ఎస్ కౌన్సిలర్ సుగుణాకర్ సస్పెన్షన్
జనగామ: పురపాలిక సాధారణ సమావేశం మంగళవారం రసాభాసగా మారింది. మున్సిపల్ చైర్‌పర్సన్‌న్ కడకంచి బాలమణిశ్రీనివాస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కాన్ఫరెన్స్ హాల్‌లో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే 18వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ గోపగోని సుగుణాకర్ గౌడ్ డ్రెయినేజీ నిర్మాణం విషయంలో గతంలో మున్సిపల్ కౌన్సిలర్ల వాట్సాప్ గ్రూపులో చైర్‌పర్సన్‌న్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా చైర్‌పర్సన్‌న్‌కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు పోడియం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు 14 మంది తమ సభ్యుడు ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొంటూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఫ్లకార్డులతో నిరసన చేపట్టి చైర్‌పర్సన్‌న్‌కు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా సుగుణాకర్ మాట్లాడుతూ..18వ వార్డులో డ్రెయినేజీ నిర్మాణం రోడ్డుకు ఎత్తుగా చేపట్టడంతో ఓ వృద్ధురాలు కిందపడ్డారని, సమస్యపై అధికారులు పట్టించుకోవడం లేదనే ఉద్దేశంతోనే వాట్సాప్ గ్రూపులో ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. 44 ఎజెండా అంశాలను కౌన్సిల్ దృష్టికి తీసుకు వెళ్లగా, 43 అంశాలను ఆమోదించారు.
అభివృద్ధి పనులపై కౌన్సిలర్ల ప్రస్తావన
మూడో వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి ఏసీ రెడ్డినగర్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీకి వెళ్లే మార్గంలో లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. డ్రెయినేజీల శుభ్రత, చెత్త సేకరణ కోసం తోపుడు బండ్లు సమయానికి తిరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల డ్రా జాబితాలో అనర్హులు, ఇళ్లు ఉన్నవారు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పేర్లు ఉన్నాయన్న ఆరోపణలపై పరిశీలన చేయాలని కోరారు. ఎస్‌డీఎఫ్ నిధుల కింద 2023లో డ్రెయినేజీ కోసం మంజూరైన రూ.5 లక్షల నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
పూర్తయిన తర్వాత ప్రశ్నించడం ఏంటి?
18వ వార్డులో డ్రెయినేజీ నిర్మాణం జరుగుతున్న సమయంలో కౌన్సిలర్‌గా సుగుణాకర్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని చైర్‌పర్సన్‌న్ కడకంచి బాలమణి ప్రశ్నించారు. డ్రెయినేజీ ఎత్తుగా నిర్మిస్తున్న సమయంలో అడ్డుకోవాల్సిన కౌన్సిలర్ నిర్మాణం పూర్తయిన తర్వాత రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. మహిళా చైర్‌పర్సన్‌న్‌ను ఉద్దేశించి అర్ధరాత్రి వాట్సాప్ గ్రూపులో ఇష్టానుసారంగా సందేశాలు పెట్టడం అవమానకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యపై కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించినట్లు తెలిపారు. సమావేశంలో తనతో పాటు కమిషనర్‌పై అనుచితంగా వ్యాఖ్యలు చేసిన సుగుణాకర్‌ను వచ్చే అక్టోబర్‌లో జరిగే కౌన్సిల్ సమావేశానికి హాజరుకాకుండా సస్పెండ్ చేసినట్లు చైర్‌పర్సన్‌న్ ప్రకటించారు. మున్సిపల్ కమిషనర్ సీహెచ్.రాజశేఖర్‌రెడ్డితో పాటు పట్టణంలోని 30 వార్డుల కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు కలిపి సుమారు 60 మంది పాల్గొన్నారు.


