భూములు..ఇళ్లు..పింఛన్లు | - | Sakshi
Sakshi News home page

భూములు..ఇళ్లు..పింఛన్లు

Sep 8 2026 1:17 AM | Updated on Sep 8 2026 1:17 AM

ప్రజావాణికి వచ్చే అర్జీల్లో ఈ సమస్యలే ఎక్కువ

జనగామ రూరల్‌: ప్రజా సమస్యలకు పరిష్కార వేదిక ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు ఏళ్ల తరబడిగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాకు తమ గోడును వెల్లబోస్తున్నారు. ప్రజల నుంచి అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌తో కలిసి 422 దరఖాస్తులను కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్‌ స్వయంగా ఫిర్యాదులను తీసుకుంటూ వారి సమస్యల తక్షణ పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాసమస్యలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని, సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ భాస్కర్‌, సీపీఓ చినకోట్యా నాయక్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ప్రజావాణిలోనూ, మండల కేంద్రాల్లో జరిగిన ప్రజావాణిలోనూ పరిశీలన చేయగా.. ఫిర్యాదుల్లో ఎక్కువగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి.

దరఖాస్తుల్లో కొన్ని ఇలా..

● బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన కర్ర రాంరెడ్డి, తాను దివ్యాంగురాలినని, పింఛన్‌ రావడం లేదని, సదరం సర్టిఫికెట్‌ ఉంద ని, పింఛను మంజూరు చేసి ఆదుకోవాలన్నారు.

● స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం ఇంద్ర నగర్‌కు చెందిన చింత అనూష.. తనది నిరుపేద కుటుంబమని, కూలి పనిచేసుకొని జీవనం సాగిస్తున్నానని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరింది.

● జనగామ మండలంలోని చౌడారం గ్రామానికి చెందిన ఎర్రోజు ఆగాచారి 47 ఏళ్ల నుంచి కారోబార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండా రెండు నెలల క్రితం పన్ను వసూలు బుక్కులను గ్రామ ప్రజాప్రతినిధి తీసుకున్నారని నేటికీ ఇవ్వకుండా, విధులకు రానివ్వకుండా గ్రామానికి చెందిన మరోవ్యక్తికి అప్పజెప్పారని కార్యదర్శికి వివరించినా పట్టించుకోవడం లేదని కలెక్టర్‌ విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని కోరారు.

● పట్టణంలోని 16వ వార్డు సంజయ్‌నగర్‌లో 15 ఏళ్ల నుంచి అద్దె భవనంలో ఉంటూ కాలం వెల్లదీస్తున్నానని, ఇంటి అద్దె భారమవుతోందని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని జాముఖన్నామ్‌ షాయిదా వినతి పత్రం అందించారు.

● పాలకుర్తి మండలం తిరుమలగిరిలో సర్వే నెంబర్‌ 74ఏలో ఎకరం 20 గుంటల భూమిని కొనుగోలు చేయగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని స్టేషన ఘన్‌పూర్‌ మండలం చాగల్‌కు చెందిన పోగుల సారంగపాణి అన్నా రు. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కింద కాంట్రాక్టర్‌ తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కాలువ పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, భూసేకరణ చేయకుండా నష్టపరిహరం చెల్లించకుండా పనుల చేస్తున్నారని విచారణ జరిపించి న్యాయం చేయాలని వినతి పత్రం అందించారు.

నెలల తరబడిగా ఆఫీసుల చుట్టూ తప్పని ప్రదక్షిణలు

కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌కు పోటెత్తిన అర్జీదారులు

ప్రజల నుంచి 422 దరఖాస్తుల స్వీకరణ

సత్వరమే పరిష్కరించాలంటూ

అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement