ఈవీఎం గోదాం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఈవీఎం గోదాం పరిశీలన

Sep 8 2026 1:17 AM | Updated on Sep 8 2026 1:17 AM

జనగామ రూరల్‌: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, త్రైమాసిక తనిఖీలో భాగంగా కలెక్టర్‌ కార్యాలయాల భవన సముదాయంలోని ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పనితీరు, మంటల నియంత్రణ పద్ధతులను పర్యవేక్షించారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్‌ మహిపాల్‌ రెడ్డి, ఎన్నికల సూపరింటెండెంట్‌ శ్రీధర్‌, కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి భాస్కర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతినిధి రవి, బీజేపీ ప్రతినిధి జగదీష్‌, తదితరులు పాల్గొన్నారు.

కౌరవసభలా అసెంబ్లీ

జనగామ: తెలంగాణ అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకోవడం అత్యంత అప్రజాస్వామిక చర్య అని ఎమ్మెల్యే డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం పల్లా మాట్లాడుతూ.. గౌరవసభ కాస్త కౌరవసభలా మారిందని, ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమన్నారు. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డితో పాటు ఇతర మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన అనుచిత, దురుసు ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధ్యులపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా పలువురు ప్రజా ప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగుతుందని, అరెస్టులు, ఆంక్షలకు భయపడేది లేదన్నారు.

చేయూత పింఛన్లపై హెల్ప్‌డెస్క్‌

జనగామ రూరల్‌: జిల్లాలో చేయూత సామాజిక భద్రత పింఛన్లకు సంబంధించి అర్హత ఉన్న లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేకంగా కలెక్టరేట్‌లోని డీఆర్డీఏ కార్యాలయంలో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన చేయూత పింఛన్ల దరఖాస్తులకు ఈ నెల 15న చివరి తేదీ అని స్పష్టం చేశారు. చేయూత పింఛన్లకు సంబంధించిన సమాచారం కోసం ప్రజలు అధికారిక మార్గాలనే ఆశ్రయించి, మధ్యవర్తులను నమ్మకుండా, తమ సందేహాలను నేరుగా ఫోన్‌ నంబర్‌ 9000019677 ద్వారా డీఆర్డీఏ కార్యాలయంలో నివృత్తి చేసుకోవాలని కోరారు. కార్యాలయ పని దినాల్లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు హెల్ప్‌ డెస్క్‌ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

నేడు పురపాలిక సాధారణ సమావేశం

జనగామ: జనగామ పురపాలిక 7వ కౌన్సిల్‌ సాధారణ సమావేశం ఈనెల 8న (మంగళవారం) ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణిశ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన మొత్తం 25 ఎజెండా అంశాలను కౌన్సిల్‌ ముందుకు తీసుకురానున్నారు. ఆయా అంశాలపై చర్చించి, కౌన్సిల్‌ ఆమోదం అనంతరం పనులు ప్రారంభించనున్నారు. ప్రధానంగా పురపాలిక పరిధిలో రోడ్ల ప్యాచ్‌ వర్కులకు రూ.40 లక్షలు కేటాయించే అంశాన్ని చర్చించనున్నారు. అలాగే పురపాలికకు అప్పగించిన ఆయా వార్డుల పరిధిలో సుమారు 11 వెంచర్లలో 10 శాతం గ్రీన్‌ల్యాండ్‌ స్థలాలను పరిరక్షించడంతో పాటు, పురపాలిక ఆధీనంలోని భూములకు రక్షణ కల్పించేందుకు రూ.10 లక్షలతో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి జియో ట్యాగింగ్‌ చేయాలని ప్రతిపాదించారు. ఇక పట్టణంలోని రంగప్ప చెరువు పరిసరాలను రూ.5 లక్షలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. గత కౌన్సిల్‌ సమావేశాల్లో వాటర్‌, లైటింగ్‌, పందులు, కోతుల నియంత్రణ తదితర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వగా, ఈసారి పట్టణ అభివృద్ధికి కీలకమైన 25 అంశాలను ఎజెండాలో చేర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement