● ఆకట్టుకున్న పలారం బండి ఊరేగింపు
● కోలాటాలు.. డప్పు చప్పుళ్లతో సందడి
జనగామ: పవిత్ర శ్రావణమాసం సోమవారం సందర్భంగా పట్టణంలోని శ్రీ మహంకాళి అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించారు. 25వ వార్డు కౌన్సిలర్ పాముకుంట్ల ప్రసాద్, నిర్వాహక బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన పలారం బండి కార్యక్రమానికి పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారికి సమర్పణగా పొట్టేళ్లతో పలారం బండిని అలంకరించి నిర్వహించిన ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఉత్సవమూర్తులను పలారం బండి వద్దకు తీసుకువచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మహంకాళి ఆలయం నుంచి ప్రారంభమైన పలారం బండి ఊరేగింపు ఆర్టీసీ చౌరస్తా, నెహ్రూ పార్కు, బొడ్రాయి మీదుగా సాగి తిరిగి అర్థరాత్రి ఆలయానికి చేరుకుంది. సీఐ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై నర్సయ్య, పోలీసు సిబ్బంది పకడ్బందీ బందోబస్తు నిర్వహించారు. వేద పండితులు వారణాసి పవన్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజు యాదవ్, నాయకులు కంచె రాములు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్లు, మేడ శ్రీనివాస్, నిమ్మతి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


