కొడకండ్ల: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2023లో సర్పంచ్ అధ్యక్షతన మండల కేంద్రంలోని జీపీ వద్ద తహసీల్దార్ ఆధ్వర్యంలో ప్రజల సమక్షంలో గ్రామసభ నిర్వహించి 50 డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి రూం, ఇంటి నెంబర్లు కేటాయించి తీర్మానం చేశారు. తామంతా ఆ ఇళ్లలో నివసిస్తున్నందున పట్టాలిచ్చి న్యాయం చేయాలని బాధితులు కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో మండల కేంద్రంలోని డబుల్‌బెడ్‌రూం ఇళ్లలో నివసిస్తున్న వారు ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు. తమకు కేటాయించిన ఇళ్లలోకి వెళ్లి అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులను అప్పు చేసి మరి ఒక్కొ ఇంటికి రూ.3 నుంచి 5 లక్షల వరకు సొంతంగా వెచ్చించామని, మూడేళ్ల నుంచి నివసిస్తున్నామని వాపోయారు. ఈ సమయంలో కలెక్టరేట్‌లో ఇటీవల డ్రా పద్ధతిలో వేరే వారికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కేటాయిస్తున్నారని తెలిసి తామంతా ఆందోళన చెందుతున్నామన్నారు. పేదలమైన తమకే డబుల్‌బెడ్‌రూం ఇళ్లను కేటాయించి పట్టాలిచ్చి ఆదుకోవాలని కోరారు.


