కాంగ్రెస్‌ హామీల అమలుపై నేడు బీఆర్‌ఎస్‌ వినతులు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ హామీల అమలుపై నేడు బీఆర్‌ఎస్‌ వినతులు

Sep 7 2026 2:56 AM | Updated on Sep 7 2026 2:56 AM

జనగామ: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాలకు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఈనెల 7న కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌లో వినతి పత్రాలు సమర్పించనున్నారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై అధికారులకు వినతులు అందించనున్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలు, 13 గ్యారంటీలు, ఆరు సూత్రాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ కోరనుంది. ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కోరనున్నారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి ఎన్నికల హామీల ప్రకారం ప్రయోజనాలు అందించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేయనున్నారు.

‘బొగత’లో సందడి

వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతం వద్ద ఆదివారం సందర్శకులు సందడి నెలకొంది. జలపాతం అందాలను వీక్షించిన పర్యాటకులు తమ సెల్‌ఫోన్లలో సెల్ఫీలు, ఫొటోలు తీసుకున్నారు. సమీప కొలనులో స్నానాలు చేసి సేదదీరారు.

హేమాచలక్షేత్రంలో

భక్తుల రద్దీ

మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండల పరిధిలోని హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వందల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ క్షేత్రం కోలాహలంగా మారింది. శ్రావణమాసం ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వంటి ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ఆటోలు, తదితర వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్నారు. ఆలయ సమీపంలో పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు రాజశేఖర్‌శర్మ, పవన్‌కుమార్‌, ఈశ్వర్‌చంద్‌శర్మ, అనిపెద్ది రాజీవ్‌ శర్మ స్వామివారికి నిర్వహించిన తిలతైలాభిషేకం పూజలో పాల్గొని భక్తులు మానవ శరీరాన్ని పోలి ఉండే లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకుని పులకించారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు నాభిచందన ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

భద్రకాళిలో ‘ప్రణవనాదం’

హన్మకొండ కల్చరల్‌: రాష్ట్ర సేవికా సమితికి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్‌ భద్రకాళి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం ‘ప్రణవ నాదం’ పేరుతో నిర్వహించిన సామూహిక ఘోష్‌ (వివిధ రకాల వాయిద్యాల) ప్రదర్శన ఆకట్టుకుంది. 90 మంది సేవికలు ఆనక్‌ (డ్రమ్‌), వంశీ, ఝల్లరి, శంఖం తదితర వాయిద్యాలతో భారతీయ సంప్రదాయ వేషధారణలో మహిళలు, యువతులు, బాలికలు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవారి సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తిరసంతో పాటు దేశభక్తి, జాతీయ భావనను చాటి చెప్పింది. మహిళల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, పెంపొందించడమే కార్యక్రమ ఉద్దేశమని రాష్ట్ర సేవికా సమితి తెలంగాణ ప్రాంత బౌద్ధిక్‌ ప్రముఖ్‌ ప్రొద్దుటూరి రూప తెలిపారు. ధర్మ, సమాజ, సంస్కృతి పరిరక్షణలో మహిళల పాత్ర కీలకమన్నారు. ప్రాచీనయుద్ధ విద్యలు, వాద్యకళలు భారతీయ సంస్కృతిలో భాగమని, వాటిని భావితరాలకు అందించడమే తయ ధ్యేయమని పేర్కొన్నారు. సమయపాలన, క్రమశిక్షణ ప్రతిరోజు అందించే శిక్షణకు ఘోష్‌ ప్రదర్శన నిదర్శనమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువత, బాలికల్లో ధైర్యం, సన్మార్గం పెంపొందిస్తాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement