● ఆలయాల చుట్టూ ఉన్న భూమి పరిధి పూర్తిగా కేంద్ర రక్షిత ప్రాంతంగా మారిపోతుంది.
● ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి, భద్రతా బాధ్యతలను ఇకపై ఏఎస్‌ఐనే స్వయంగా చూసుకోనుంది.
● చారిత్రక కట్టడాల పరిరక్షణలో భాగంగా ఆలయ పరిసరాల్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా కఠిన నిబంధనలు అమలుచేస్తారు.
● వీటి ప్రాశస్త్యాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటారు.
కాకతీయుల రాజ్య వైభవానికి, నాటి ఆలయ నిర్మాణాల నైపుణ్యానికి సజీవ సాక్ష్యం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో గల రామప్పలోని కట్టడాలు. రామప్ప ఆలయానికి 2021 జూలై 25న యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా లభించింది. ఈ ఆలయ పరిధిలోని ఒక ఉప ఆలయం గొల్లాల గుడి. రామప్ప ఆలయానికి నైరుతి దిశలో ఉన్న ఈ గొల్లాల గుడి మూడు గర్భగుడులతో కూడిన త్రికూటాలయం. తూర్పు ముఖంగా ఉన్న మండపం, మూడు గర్భాలయాలు, సున్నితంగా చెక్కిన ద్వారబంధాలు, హంసల వరుసలు, దేవతామూర్తుల శిల్పాలు నాటి శిల్పుల కళా నైపుణ్యాన్ని కళ్లకు కడతాయి. శతాబ్దాలుగా శిల్ప వైభవాన్ని కాపాడుకుంటూ వచ్చిన ఈ చారిత్రక కట్టడాన్ని తాజాగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా ప్రకటించింది. దీంతో ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్పకు గొల్లల గుడి మరో మణిహారంగా నిలవనుంది.
వైభవానికి ప్రతీక త్రికూటాలయం
రామప్ప పరిసరాల్లోని మరో అపురూప చారిత్రక కట్టడం గొల్లాల గుడి జాతీయ పురావస్తు సంరక్షణ పరిధిలోకి చేరింది. తూర్పు ముఖంగా ఉన్న మండపం చుట్టూ మూడు గర్భగుడులు ఉండేలా ఆలయ నిర్మాణం కొనసాగింది. ఆలయ ద్వారబంధాలు, ద్వారాలపై చెక్కిన హంసల వరుసలు, ద్వారపాలకుల శిల్పాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. గుడి గోడలపై ఉన్న శిల్పాలు కాకతీయుల కళా వైభవానికి అద్దం పడుతున్నాయి. ఆలయానికి విష్ణు, లక్ష్మీ, గణేశ్, మహిషాసురమర్ధిని తదితర దేవతామూర్తులను అందంగా చెక్కారు. ఆలయ పీఠభాగంలో జంతువుల ప్రతిమలు, పుష్పాల ఆకృతులు కనిపిస్తాయి. ఎత్తయిన పీఠంపై నిర్మించిన ఈ ఆలయంలోని ప్రతీ నిర్మాణ భాగం నాటి శిల్పుల ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది.
తొలి స్మారక చిహ్నంగా
శివ తారకేశ్వరస్వామి ఆలయం
శివ తారకేశ్వరస్వామి(శివాలయం) ఆలయాన్ని జాతీయ ప్రాముఖ్యత స్మారక చిహ్నంగా గుర్తిసూ గత జూలై 6న భారత పురావస్తు సర్వేక్షణ (ఎఎస్‌ఐ) సంస్కృతి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఇందులోనూ కాకతీయ కట్టడాల నిర్మాణశైలి ఉంటుంది. కాగా, ప్రస్తుతం ఈ ఆలయంలో కొంతభాగం కూలిపోగా, ఇనుపస్తంభాలు పెట్టి నిలబెట్టారు. కాకతీయ కాలపు నిర్మాణ చాతుర్యాన్ని ప్రదర్శించే రామప్పలోని 10 ఉప ఆలయాలను కూడా జాతీయ సంపదగా గుర్తించాలని పర్యాటకులు కోరుతున్నారు.
ఆలయాన్ని అభివృద్ధి చేయాలి..
జాతీయ స్మారక చిహ్నంగా గుర్తింపు పొందిన గొల్లాల గుడిని కేంద్ర పురావస్తుశాఖ అధికారులు అభివృద్ధిలోకి తీసుకురావాలి. త్రికూటాలయానికి ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. ఆలయంలో నిత్యపూజలు జరిగేలా అధికారులు చొరవ తీసుకోవాలి. రామప్ప పరిసర ప్రాంతాల్లోని ఉప ఆలయాలను సైతం వినియోగంలోకి తీసుకొస్తే రామప్ప పర్యాటకకేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుంది.
– కోమల్లపల్లి హరీశ్‌శర్మ,
రామప్ప ఆలయ ప్రధాన పూజారి
భారత పురావస్తు శాఖ పరిధిలోకి గొల్లాల గుడి, శివ తారకేశ్వరస్వామి
ఆలయాలు
నాటి త్రికూటాలయమే నేటి గొల్లాల గుడి
నిర్మాణంలో కాకతీయుల శిల్పకళ
ప్రయోజనాలు..


