నాణ్యమైన విద్య అందించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్య అందించాలి

Sep 4 2026 1:06 AM | Updated on Sep 4 2026 1:06 AM

జనగామ రూరల్‌: విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించి, వారి బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని తెలంగాణ ప్రభుత్వ షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ (ఎస్‌సీడీడీ) కార్యదర్శి, జిల్లా ఎస్‌ఐఆర్‌ అబ్జర్వర్‌ విజయేందిర బోయి ఆదేశించారు. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాతో కలిసి హనుమకొండ రోడ్డులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యా బోధన, విద్యార్థుల హాజరు, వసతులు, భోజన నాణ్యత, పరిశుభ్రత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌ఐఆర్‌ అబ్జర్వర్‌ విద్యార్థులతో మాట్లాడి, వారి లక్ష్యాలు, అభిరుచులు, చదువుపై ఆసక్తి గురించి తెలుసుకున్నారు. కేవలం పాఠ్యాంశాలు చెప్పడమే కాకుండా ప్రతీ విద్యార్థికి అర్థమయ్యే విధంగా బోధన సాగాలని, చదువుపై ఆసక్తి పెంచే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. తనిఖీలో భాగంగా మరుగుదొడ్లు, డైనింగ్‌ హాల్‌, తరగతి గదులు, కంప్యూటర్‌ ల్యాబ్‌, ఆర్ట్‌ గ్యాలరీ, జిమ్‌ గది, స్టాక్‌ రూమ్‌లను పరిశీలించారు. స్టాక్‌ రూమ్‌లో బియ్యం, ఇతర ఆహార నిల్వల నాణ్యతను తనిఖీ చేసి, మెనూ ప్రకారం సమయానికి పోషకాహారం అందించాలని ఆదేశించారు. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇచ్చి, విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరామ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ రెడ్డి, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి విక్రమ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మాధవీ లత, జోనల్‌ అధికారి ఎస్‌. విద్యారాణి, డీసీఓ పి.మాన్విచంద్‌, ప్రిన్సిపాల్‌ ఎ.నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

పకడ్బందీగా ఎస్‌ఐఆర్‌ నోటీసుల

పరిష్కార ప్రక్రియ

ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నోటీసుల హియరింగ్‌, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియను నిబంధనల మేరకు పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వ షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ (ఎస్‌సీడీడీ) కార్యదర్శి జిల్లా అబ్జర్వర్‌ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మండలంలోని శామీర్‌పేట్‌, జనగామ మున్సిపల్‌ కార్యాలయంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ హియరింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాతో కలిసి పరిశీలించారు. జిల్లాలో జరుగుతున్న హియరింగ్‌ ప్రక్రియ ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎలాంటి లోపాలకు తావు లేకుండా నిర్వహించాలని ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలకు సూచించారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ హియరింగ్‌ ప్రక్రియను పరిశీలించిన జిల్లా అబ్జర్వర్‌, కలెక్టర్‌ పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు, విచారణ ప్రస్తుత స్థితి, అభ్యంతరాల పరిష్కార పురోగతిని సమీక్షించారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ గోపిరామ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ రెడ్డి, తహసీల్దార్‌ మహిపాల్‌ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, బీఎల్‌ఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మెనూ ప్రకారం ఆహారం అందించాలి

రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ (ఎస్‌సీడీడీ) కార్యదర్శి విజయేందిర బోయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement