● మెడికల్ కళాశాలలో వసతుల తనిఖీ
● జనరల్ సర్జరీకి ఆరు సీట్లపై ప్రత్యేక దృష్టి
జనగామ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పీజీ వైద్య విద్య సీట్ల మంజూరుకు మార్గం సుగమం కానుంది. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) బృందం గురువారం కళాశాలను సందర్శించి పీజీ విద్యార్థులకు అవసరమైన బోధన, వైద్య, మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించింది. కళాశాల ప్రిన్సిపాల్ నాగమణి, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎ.శంకర్.. ఎన్‌ఎంసీ బృందానికి కళాశాల సౌకర్యాలు వివరించారు. జనగామ మెడికల్ కళాశాలలోని 12 విభాగాల్లో మొత్తం 50 పీజీ సీట్లు మంజూరు చేయాలని కళాశాల అధికారులు ప్రతిపాదించారు. ఇందులో జనరల్ మెడిసిన్ 5, జనరల్ సర్జరీ 6, అనస్థీషియా 4, ఆర్థోపెడిక్స్ 4, సైకియాట్రీ 3, మైక్రోబయాలజీ 2, పీడియాట్రిక్స్ 4, గైనకాలజీ 6, అనాటమీ 4, ఫిజియాలజీ 4, ఫార్మకాలజీ 4, పాథాలజీ 4 సీట్లు అవసరమున్నట్లు వారి దృష్టికి తీసుకుకెళ్లారు.
జనరల్ సర్జరీపై ప్రత్యేక పరిశీలన..
తొలిదశలో జనరల్ సర్జరీ విభాగానికి ఆరు పీజీ సీట్ల మంజూరు అంశంపై ఎన్‌ఎంసీ బృందం ప్రత్యేకంగా పరిశీలించింది. మెడికల్ కళాశాలలో ప్రస్తుతం ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నట్లు అధికారులు వివరించారు.
ఎంఆర్‌ఐ సహా మౌలిక వసతులపై ఆరా..
పీజీ సీట్ల మంజూరులో భాగంగా కళాశాల భవనం, ఓపీ సేవలు, ల్యాబొరేటరీలు, బోధన సౌకర్యాలు, లైబ్రరీ, ఆస్పత్రిలోని వైద్య సేవలు తదితర అంశాలను బృందం తనిఖీ చేసింది. ముఖ్యంగా ఎంఆర్‌ఐ సౌకర్యం అందుబాటులో లేకపోవడంపై అధికారులు వివరించారు. ఎంఆర్‌ఐ ఏర్పాటుకు ఇప్పటికే ప్రతి పాదనలు పంపినట్లు తెలిపారు. ఎన్‌ఎంసీ బృందం నుంచి సానుకూల నివేదిక వస్తే అక్టోబర్‌లో జనరల్ సర్జరీ విభాగానికి ఆరు పీజీ సీట్లు మంజూరయ్యే అవకాశం ఉందని కళాశాల వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే జనగామ మెడికల్ కళాశాలలో పీజీ వైద్య విద్యకు తొలి అడుగు పడినట్లవుతుంది.
డీసీపీకి అభినందనలు
జనగామ: డీసీపీ రాజామహేంద్రనాయక్ ఐపీఎస్ క్యాడర్‌కు పదోన్నతి పొందిన సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు ఆయన్ను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఎస్‌ఈ సంపత్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు డీసీపీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజా మహేంద్రనాయక్ భవిష్యత్ సేవా ప్రస్థానం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఈ ఎం.లక్ష్మీనారాయణరెడ్డి, ఏడీఈ డి.వేణుగోపాల్, ఏఈ బి.సౌమ్య తదితరులు ఉన్నారు.


