జఫర్‌గఢ్: మండలంలోని ఉప్పుగల్లు రిజర్వాయర్ ద్వారా నీరందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నాగుర్ల వెంకటేశ్వర్లు గురువారం రిజర్వాయర్‌లో పిండప్రదానం చేసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా నిరసన ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అనంతరం పిండాలను రిజర్వాయర్ నీటిలో వదిలారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలతో పాటు అనేక హామీలు ఇచ్చి విస్మరించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్‌లో చేరి ప్రజలను మోసం చేయడంతో పాటు ఉప్పుగల్లు రిజర్వాయర్ ద్వారా ఒక్క ఎకరాకు సాగునీరు అందించకపోవడం, ఎంపీగా ఎన్నికైన కడియం కావ్య ఇప్పటివరకు పైసా నిధులు కేటాయించకడపోవడాన్ని నిరసిస్తూ ఈ ముగ్గురికి పిండ ప్రదానం చేసినట్లు తెలిపారు. ఇప్పటికై నా ఉప్పుగల్లు రిజర్వాయర్ ద్వారా పంటలకు సాగునీరు అందించడంతో పాటు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల న్నీంటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.


