జిల్లాలోని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య సమస్యలు
జిల్లాలోని మున్సిపాలిటీలకు పారిశుద్ధ్య సమస్య సవాల్‌గా మారింది. జనగామ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణపై చర్యలు తీసుకుంటున్నా పలు కాలనీల్లో చెత్త పేరుకపోయి దుర్గంధం వెదజల్లుతూనే ఉంది. స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీగా మారినా పారిశుద్ధ్య నిర్వహణ లేమి కనిపిస్తోంది.
జనగామ: పురపాలక పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ గతంతో పోలిస్తే మెరుగుపడినా.. పలు ప్రాంతాల్లో చెత్త, మురుగునీరు, డ్రెయినేజీ సమస్యలు పట్టణ స్వచ్ఛతకు సవాల్‌గా మారుతున్నా యి. 30 వార్డులు, సుమారు 75 వేల జనా భా ఉన్న పట్టణంలో రోజూ సుమారు 10 టన్నుల చెత్త సేకరిస్తున్నారు. ఇందుకోసం అన్ని విభా గాలు కలిపి 154 మంది పారి శుధ్య కార్మి కులు, 33 ఆటోలు, ట్రాక్టర్లు, డంపర్లు పనిచేస్తున్నాయి. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సమస్యలు కొనసాగుతున్నాయి.
సమస్యలు ఇలా..
భవానీనగర్ బస్‌డిపో వెనుక రోడ్డుపై నిత్యం చెత్త పేరుకుపోతుండటంతో పందులు వీరవిహారం చేస్తున్నాయి. స్వర్ణకళామందిర్ రోడ్డులోనూ చెత్త దుర్గంధం వెదజల్లుతోంది. హైదరాబాద్ రోడ్డులోని ప్రధాన నాలా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోవడంతో మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి దోమల సమస్య పెరుగుతోంది. ఆయుష్మాన్ ఆస్పత్రి వెను క డ్రెయినేజీ సక్రమంగా లేక మురుగునీరు రోడ్డు పైకి చేరుతోంది. దయానిలయం, బాలాజీనగర్, కెనరా బ్యాంకు గల్లీ, బాణాపురం హౌసింగ్ బోర్డు కాలనీ, ఇందిరమ్మనగర్, గ్రేయిన్ మార్కెట్ ప్రాంతం, బీరప్పగడ్డ పరిసరాల్లోనూ పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడాల్సిన అవసరం ఉంది. జీఎంఆర్, జ్యోతినగర్ కాలనీలో పలు ప్రాంతాల్లో నూతన డ్రెయినేజీలు నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం తాత్కాలిక మట్టి కాలువల ద్వారా మురుగునీటిని తరలిస్తుండటంతో దుర్గంధం నెలకొంటోంది. డ్రెయినేజీలు, నాలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో మురుగునీరు ముందుకెళ్లడం లేదు.
చెత్త తొలగిస్తున్నా.. మురుగు సమస్య
నాలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు..
రోడ్లపై మురుగునీరు
పట్టణ పారిశుద్ధ్యానికి ‘డ్రెయినేజీ’ గండం
రోగాలు ప్రబలే అవకాశం ఉందని ప్రజల ఆవేదన
స్టేషన్‌ఘన్‌పూర్: రెవెన్యూ డివిజన్, నియోజకవర్గ కేంద్రమైన స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీగా మారి ఏడాదిన్నర గడుస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పట్టింపులేనితనంతో పారిశుద్ధ్యం పడకేసింది. మున్సిపాలిటీ పరిధిలో 18 వార్డులకు గాను 30,528 జనాభా ఉండగా 7,400 గృహాలు ఉన్నాయి. 18 వార్డులకు రెగ్యులర్‌గా ఒకరే వార్డు ఆఫీసర్ ఉండగా మిగిలిన పదిహేడు వార్డులకు జూనియర్ అసిస్టెంట్లను ఇన్‌చార్జులుగా నియమించారు. అయితే మున్సిపాలిటీకి నూతనంగా ప్రత్యేకమైన సిబ్బందిని నియమించకపోవడంతో గతంలో పనిచేసిన పారిశుద్ధ్య సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది కొరతతో ఏ వార్డులో చూసినా డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా ఉండి కాలనీలు కంపుకొడుతున్నాయి. ప్రధానంగా ఘన్‌పూర్ ఎస్సీ కాలనీ, ముదిరాజ్ కాలనీ, శివునిపల్లి ఎస్సీ కాలనీలో పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రస్తుత వర్షాకాలంలో పారిశుద్ధ్య లోపంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తూతూమంత్రంగా పారిశుద్ధ్య పనులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు.
పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలి
మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. డ్రెయినేజీలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో కాలనీలు కంపుకొడుతున్నాయి. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండగా రోడ్లపై మురుగునీరు పారుతోంది. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.
– మునిగెల రాజు, స్టేషన్‌ఘన్‌పూర్


