బ్యాగు లేకుండా బడికి! | - | Sakshi
Sakshi News home page

బ్యాగు లేకుండా బడికి!

Sep 2 2026 2:52 AM | Updated on Sep 2 2026 2:52 AM

ఏడాదిలో పది రోజులు పుస్తకాల

బరువుకు సెలవు

ఆటలు, పాటలు, ప్రయోగాలతో చదువులు

ఐదు రోజుల షెడ్యూల్‌ ప్రకటించిన

విద్యాశాఖ

జనగామ: విద్యార్థులపై చదువు ఒత్తిడిని తగ్గిస్తూ, తరగతి గది అభ్యసనాన్ని మరింత ఆసక్తికరంగా, ఆనందదాయకంగా మార్చేందుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని పాఠశాలల్లో 10 ‘బ్యాగ్‌లెస్‌ డేస్‌’ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష తెలంగాణ డైరెక్టర్‌ డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ మార్గదర్శకాలు జారీ చేశారు. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాలో పీఎస్‌లు 341(ఇందులో జీరో స్కూల్‌ ఉన్నాయి), ప్రాథమి కోన్నత 64, ఉన్నత 103 పాఠశాలల పరిధిలో 30వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

మూడో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు

షెడ్యూల్‌ ప్రకారం మూడో శనివారం బ్యాగ్‌లెస్‌ డే కార్యకలాపాలు నిర్వహించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ రోజుల్లో సాధారణ బోధనకు భిన్నంగా కార్యాచరణ ఆధారిత అభ్యసనానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విద్యార్థుల వయస్సు, తరగతి స్థాయి, ఆసక్తులు, స్థానిక పరిస్థితులు, పాఠశాలలో అందుబాటులో ఉన్న వనరులను పరిగణనలోకి తీసుకుని కార్యక్రమాలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను పాఠశాలలకు కల్పించారు. క్విజ్‌, బాలసభ, క్షేత్ర పర్యటనలు, సర్వేలు, నాటికలు, ప్రయోగాలు, సబ్జెక్ట్‌ కార్నర్లు వంటి కార్యక్రమాలను నిర్వహించవచ్చు.

స్థానిక పరిజ్ఞానానికి పెద్దపీట

బ్యాగ్‌లెస్‌ డేస్‌లో భాగంగా విద్యార్థులను చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లడం ద్వారా స్థానిక చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించవచ్చు. అలాగే స్థానిక కళాకారులు, చేతి వృత్తిదారులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో విద్యార్థులకు పరస్పర కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. త ద్వారా పాఠ్యపుస్తకాల్లో చదివే అంశాలకు స్థానిక జీ వన విధానాన్ని అనుసంధానం చేయవచ్చు. తోటల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, కళలు, క్రీడలు తదితర అంశాలపైనా కార్యకలాపాలు చేపట్టవచ్చు.

వృత్తి పరిచయంతో భవిష్యత్‌ నైపుణ్యాలు

ఇందులో వృత్తి పరిచయానికి కూడా ప్రాధాన్యం ఇవ్వడం ప్రత్యేకతగా నిలుస్తోంది. స్థానికంగా ఉన్న చేతివృత్తిదారులు, నిపుణులు తమ పనితీరును విద్యార్థులకు వివరించడం, చిన్నచిన్న ప్రదర్శనలు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా వివిధ వృత్తులపై అవగాహన కల్పించవచ్చు.

ఉపాధ్యాయులదే కీలకపాత్ర

బ్యాగ్‌లెస్‌ డేను కేవలం వినోద కార్యక్రమంగా కాకుండా అభ్యసన ప్రక్రియలో భాగంగా నిర్వహించాల్సిన బాధ్యత పాఠశాలలపై ఉంది. ప్రధానోపాధ్యాయుడు కార్యక్రమాన్ని సమన్వయం చేయడంతో పాటు విద్యార్థుల భద్రతను పర్యవేక్షించాలి.

ఒత్తిడి లేని అభ్యసనకు దోహదం

పుస్తకాలకే పరిమితమైన విద్యకు బదులుగా అనుభవం ద్వారా నేర్చుకునే విధానం విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యం, బృందంగా పనిచేసే నైపుణ్యం, కమ్యూనికేషన్‌, పరిశీలన, ప్రశ్నించే తత్వం పెంపొందించేందుకు దోహదపడనుంది. ఒకే అంశాన్ని చదవడం కంటే దాన్ని ప్రత్యక్షంగా చూడటం, పరిశీలించడం, ప్రయోగించడం ద్వారా విద్యార్థులు ఎక్కువగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా బ్యాగ్‌లెస్‌ డేస్‌ కార్యక్రమం విద్యార్థులకు పుస్తకాల నుంచి విరామం కల్పించడం మాత్రమే కాకుండా, పుస్తక జ్ఞానాన్ని జీవిత నైపుణ్యాలతో కలిపే వేదికగా ఉపయోగపడనుంది.

బ్యాగ్‌లెస్‌ డే.. ప్రకటించిన కార్యక్రమ తేదీలు

ప్రస్తుతం జారీ చేసిన సమాచారంలో పేర్కొన్న తేదీ ల ప్రకారం సెప్టెంబర్‌ 19, నవంబర్‌ 21, డిసెంబర్‌ 19, ఫిబ్రవరి 20, మార్చి 20 తేదీల్లో బ్యాగ్‌లెస్‌ డే కార్యకలాపాలు నిర్వహించనున్నారు. మిగిలిన కార్యక్రమ తేదీలను ప్రకటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement