● ‘డబుల్’ లబ్ధిదారుల ఎంపికపై
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష
జనగామ రూరల్: జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించి, ఈనెల 5వ తేదీలోగా తుది జాబితాను ఖరారు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదా రుల తుది జాబితా ఖరారుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు మొత్తం 1,137 రెండు పడక గదుల ఇళ్లు కేటాయించగా అర్హుల ఎంపికలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ముందుగా ఎల్–3, ఎల్–2 ప్రాధాన్య క్రమంగా జాబితాలను పూర్తిగా పరిశీలించి, అర్హులైన లబ్ధిదారుల తుది జాబితాను సిద్ధం చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక అనంతరం లక్కీ డ్రా విధానం ద్వారా ఇళ్ల కేటాయింపు నిర్వహించాలన్నారు.
ప్రణాళికాబద్ధంగా భూసర్వే పనులు
ఉమ్మడి జిల్లాలో భూ సర్వేలో జనగామ ముందంజలో ఉందని, ఇదే వేగంతో మరింత సమర్థవంతంగా, నాణ్యతతో పనులను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాకు ప్రభుత్వం నిర్దేశించిన భూ సర్వే లక్ష్యాన్ని నవంబర్ 30వ తేదీ నాటికి తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విధులకు హాజరుకాని సర్వేయర్లకు నోటీసులు జారీ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో సర్వే అండ్ ల్యాండ్స్ ఏడీ మన్యంకొండ, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ మాధవీ లత, సర్వేయర్లు పాల్గొన్నారు.
భవన నిర్మాణాలు పూర్తి చేయాలి
జిల్లాలో వీబీజీ రామ్ జీలో భాగంగా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా, నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. వీఓ, జీపీ, అంగన్‌వాడీ భవన నిర్మాణ, తదితర పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓబులకేశ్వాపూర్‌లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సెంటర్ నిర్మాణ పనులు గడువులోగా పూర్తి చేయాలన్నారు. నర్మెట మండలంలో పైలట్ ప్రాజెక్టుగా మష్రూమ్ కల్చర్‌ను ప్రారంభించి, మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డీఆర్‌డీఓ భాస్కర్, ఈఈ (పీఆర్) రవీందర్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.


