నాన్‌ టీచింగ్‌ పోస్టుల ఎంపిక పరీక్ష | - | Sakshi
Sakshi News home page

నాన్‌ టీచింగ్‌ పోస్టుల ఎంపిక పరీక్ష

Aug 31 2026 1:14 AM | Updated on Aug 31 2026 1:14 AM

జనగామ రూరల్‌: జిల్లాలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, తెలంగాణ ఆదర్శ పాఠశాలల బాలికల వసతి గృహాలలో ఖాళీగా ఉన్న నాన్‌–టీచింగ్‌ పోస్టుల ఎంపిక పరీక్షను ఆదివారం కలెక్టర్‌ కార్యాలయంలోని మెయిన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించారు. కేజీబీవీల్లో మొత్తం 9 నాన్‌టీచింగ్‌ పోస్టులు, అలాగే ఆదర్శ పాఠశాలల బాలికల వసతి గృహాలలో అసిస్టెంట్‌ కుక్‌ 1, బచ్చన్నపేట, వాచ్‌ఉమెన్‌ 1, రఘునాథపల్లిలతో కలిపి మొత్తం 2 నాన్‌–టీచింగ్‌ పోస్టులు భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించగా, మొత్తం 32 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 30 మంది అభ్యర్థులు ఎంపిక పరీక్షకు హాజరయ్యారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఏడీ శ్రీనివాస్‌, జీసీడీఓ గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు.

‘మాచన’కు ఏయిమ్స్‌ ఆహ్వానం

జనగామ: పొగాకు నియంత్రణలో విశేష కృషి చేస్తూ అంతర్జాతీయ గుర్తింపు పొందిన పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్దార్‌ మాచన రఘునందన్‌కు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఏయిమ్స్‌) నుంచి మరోసారి ఆహ్వానం అందింది. వచ్చే నెల 5న ఏయిమ్స్‌లో నిర్వహించనున్న సదస్సుకు హాజరు కావాలని డాక్టర్‌ దత్తా కోరినట్లు రఘునందన్‌ ఆదివారం జిల్లా కేంద్రంలో తెలిపారు. ఈ సందర్భంగా పొగాకు నియంత్రణకు సంబంధించి దేశ వ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజల్లో అవగాహన పెంచే అంశాలపై చర్చించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇటీవల స్ట్రాటజిక్‌ ఇన్‌న్‌స్టిట్యూట్‌ ఫర్‌ పబ్లిక్‌ హెల్త్‌ రీసెర్చ్‌ (సైఫర్‌) సంస్థ టుబాకో కంట్రోల్‌ ‘ీహీరో’ అవార్డుకు తనను ఎంపిక చేసిన విషయాన్ని రఘునందన్‌ గుర్తు చేశారు. పొగాకు రహిత సమాజ నిర్మాణం కోసం భవిష్యత్తులో మరింత విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

చిల్పూరుగుట్టపై ఎలుగుబంట్ల సంచారం

చిల్పూరు: మండల కేంద్రంలోని చిల్పూరుగుట్టపై పిల్లలతో ఉన్న ఎలుగుబంటి కనిపించడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. ఆదివారం వాగు సమీపంనుంచి గుట్టపైకి ఎక్కుతుండగా రైతులు మూల నాగరాజు, గాదె రాజయ్య చూసి ఇతర రైతులను అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎలుగుబంటి తన రెండు పిల్ల ఎలుగుబంట్లతో తిరుగుతోందని, అటవీ శాఖ అధికారులు అప్రమత్తం కావాలని స్థానికులు కోరారు.

సబ్‌స్టేషన్లలో

ఆకస్మిక తనిఖీ

జనగామ రూరల్‌: డివిజన్‌ పరిధిలోని జనగామ టౌన్‌–2 పెంబర్తి గేట్‌వే సబ్‌స్టేషన్లను వరంగల్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ మధుసూదన్‌ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌లో జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించి, సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలన్నారు. అలాగే అడవి కేశపూర్‌ సబ్‌స్టేషన్‌లో ఉన్న 5.0 ఎంవీఏ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను 8.0 సామర్థ్యం గల పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌గా చార్జీ చేశారు. సామర్థ్యంపెంపుదల వల్ల సబ్‌స్టేషన్‌ పరిధిలోని వినియోగదారులకు లో–ఓల్టేజ్‌ సమస్యలు తగ్గడంతో పాటు, రైతులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్‌ సరఫరా అందించేందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ డివిజనల్‌ ఇంజనీర్‌ లక్ష్మీనారాయణ రెడ్డి, ఏడీఈ వేణుగోపాల్‌, ఏఈ మధు, శ్రీ కుమార్‌ పాల్గొన్నారు.

‘బొగత’ అదుర్స్‌

వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దీంతో ఆదివారం సెలవు రోజు కావడంతో పర్యాటకులు భారీగా తరలివచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement