జనగామ: పవిత్ర శ్రావణ ఆదివారం సందర్భంగా జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు మహిళలు భారీసంఖ్యలో తరలిరావడంతో ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. జిల్లా కేంద్రంలోని ధర్మకంచ, మహంకాళీ స్ట్రీట్, కుర్మవాడ, బాలాజీనగర్, సంజయ్‌నగర్, పాతబీటు బజార్ తదితర ప్రాంతాల నుంచి గణేష్ స్ట్రీట్‌పోచమ్మ ఆలయానికి పట్టణంలోని నలుమూలల నుంచి మహిళలు బోనాలతో తరలివచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం అమ్మవారికి బోనంలోని నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం ఓడి బియ్యం పోసి, పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఆయా దేవాలయాల్లోనూ భక్తులు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


