● 517 కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు
● ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి
జనగామ: చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఎన్పీడీసీఎల్ ప్రత్యేక చర్యలు చేపడుతోందని జనగామ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సంపత్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో 517 అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించినట్లు వెల్లడించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు ప్రీ–స్కూల్ కార్యకలాపాలు, ఆటలు, అభ్యసన కార్యక్రమాలు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలను సజావుగా నిర్వహించేందుకు విద్యుత్ సౌకర్యం ఎంతో దోహదపడుతుందని ఎస్‌ఈ పేర్కొన్నారు. విద్యుత్ కనెక్షన్లు అందుబాటులోకి రావడంతో కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు, తాగు నీటి మోటార్లు, ఇతర విద్యుత్ పరికరాలను సక్రమంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడిందన్నారు.


