బోను చూస్తే చాలు జారుకుంటున్న వానరాలు
మనిషి వ్యూహానికి వానరమూకల ప్రతి వ్యూహం. బోను కనిపిస్తే బుద్ధిగా పక్కకు. గుంపును నడిపించే పెద్ద కోతులే ఇప్పుడు అధికారులకు సవాల్‌గా మారాయి. బోను పెట్టారు.. ఎర వేశారు..కోతులు వచ్చాయి.. కానీ చిక్కలేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. రోజుల తరబడి ఇదే తంతు. చిన్న కోతులు బోనులో పడుతున్నా.. వాటి వెనుకే ఉంటూ పరిస్థితిని గమనిస్తున్న పెద్ద కోతులు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. బోను ఎక్కడ పెట్టారు, అందులోకి వెళ్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ముందుగానే పసిగట్టినట్టుగా దూరంగా ఉంటున్నాయి. దీంతో పట్టణంలో కోతుల పట్టివేత కార్యక్రమానికి కొత్త చిక్కు ఎదురవుతోంది. వేలసంఖ్యలో కోతులను పట్టుకున్నా, చివరికి మిగిలినవే ‘లీడర్’ కోతులుగా మారి మున్సిపల్ సిబ్బందికి సవాల్ విసురుతున్నాయి. –జనగామ
పట్టణంలోని 30 వార్డుల పరిధిలో కొన్నేళ్లుగా కోతుల సంఖ్య విపరీతంగా పెరిగింది. సుమారు ఐదు వేలకుపైగా కోతులు పట్టణంలో సంచరిస్తున్నట్లు అంచనా. ఇళ్లలోకి చొరబడటం, ఆహార పదార్థాలు లాక్కోవడం, చేతిలోని సంచులు ఎత్తుకెళ్లడం, పాదచారులను వెంబడించడం, దాడులకు పాల్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోతుల దాడుల్లో పలువురు గాయపడిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి.
రెండున్నర నెలలుగా వేట
కోతుల సమస్యకు పరిష్కారం చూపేందుకు మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కోతుల పట్టివేతకు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రత్యేక బృందానికి బాధ్యతలు అప్పగించి బోన్ల ద్వారా కోతులను పట్టుకునే ప్రక్రియ ప్రారంభించారు. సుమారు రెండు నెలల వ్యవధిలో 4,100 కోతులను పట్టుకుని, మున్సిపల్ పర్యవేక్షణలో దట్టమైన అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టారు.
మిగిలినవే చిక్కడం లేదు
ప్రస్తుతం వెయ్యి నుంచి 1,500 వరకు కోతులు ఇంకా పట్టుబడాల్సి ఉంది. వీటిని పట్టుకునేందుకు పది నుంచి ఇరవై రోజుల పాటు బోన్లు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. చిన్న కోతులు బోన్లలో చిక్కుతున్న సమయంలో పెద్ద కోతులు మాత్రం చుట్టుపక్కల నుంచే పరిస్థితిని గమనిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. బోను దగ్గరకు వెళ్లకుండా గుంపును కూడా వెనక్కి తీసుకెళ్తున్నట్లు పట్టుకునే బృందం గుర్తించింది.
జ్ఞాపకశక్తే ఇప్పుడు అడ్డంకి
పట్టణంలో అనేక ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేయడం వల్ల కోతులు వాటిని గుర్తుంచుకుంటున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎర వేసినప్పటికీ గత అనుభవాన్ని బట్టి ప్రమాదాన్ని అంచనా వేస్తున్నట్లు వాటి ప్రవర్తన కనిపిస్తోంది. దీంతో కోతుల అలవాట్లు, గుంపు ప్రవర్తన, ఆహారపు విధానం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం బోన్లు ఏర్పాటు చేయడం ద్వారా సమస్యను పూర్తిగా పరిష్కరించడం కష్టంగా మారింది.
కోతుల వేటను పసిగడుతూ పక్కకు..
పట్టివేత బృందానికి కొన్ని రోజులుగా సవాల్
పట్టుబడినవి 4,100..
మిగిలినవి ‘లీడర్’ కోతులు
పట్టివేతకు 45రోజుల విరామం..
పట్టణ ప్రజలకు తప్పని
వానర బెడద
‘లీడర్’ కోతులదే పైచేయి
వానరమూకల్లో పెద్ద కోతులు ముందుండి గుంపును నడిపిస్తుంటాయి. ప్రమాదాన్ని గుర్తించినప్పుడు మిగిలిన వాటిని అప్రమత్తం చేసే స్వభావం వాటిలో కనిపిస్తుంది. పట్టణంలో ప్రస్తుతం పట్టుబడకుండా మిగిలిన కోతుల్లో ఇలాంటి లీడర్ కోతులే ఎక్కువగా ఉన్నాయని పట్టుకునే బృందం భావిస్తోంది. అందుకే మిగిలిన వాటిని పట్టుకోవడం మొదట్లో పట్టుకున్న 4,100 కోతులతో పోలిస్తే మరింత క్లిష్టంగా మారింది.
45 రోజుల విరామం
వరుసగా బోన్లు ఏర్పాటు చేస్తే కోతులు మరింత అప్రమత్తమయ్యే అవకాశం ఉండటంతో వానరా లు పట్టుకునే బృందం ప్రస్తుతం విరామం తీసుకుంది. 45 రోజులపాటు బోన్లకు దూరంగా ఉంచి, కోతులు వాటిని మరిచిపోయిన తర్వాత మళ్లీ పట్టుకునే ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందన్నది చూడాలి. ధర్మకంచ, బాలాజీ నగర్, కురుమవాడతో పాటు పలు ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉంది. ఇప్పటివరకు 4,100 కోతులను పట్టుకోవడం కొంత ఉపశమనాన్ని కలిగించినా, మిగిలిన వెయ్యి నుంచి 1,500 కోతులను పట్టుకునే వరకు సమస్య పూర్తిగా తీరినట్లు చెప్పలేని పరిస్థితి.


