జనగామ: జిల్లా కేంద్రంలోని చంపక్‌హిల్స్ మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్)లో వైద్య సేవలు మరింత వేగవంతం కానున్నాయి. గత కొన్నేళ్లుగా అందుబాటులో లేని సీబీపీ రక్త పరీక్షల యంత్రం తాజాగా ఆస్పత్రిలో ఏర్పాటు చేయడంతో రోగులకు సత్వర రిపోర్టులు అందనున్నాయి. ఎంసీహెచ్‌కు ప్రతిరోజూ సుమారు 400 మంది వరకు ఓపీకి వస్తుంటారు. రోజుకు సగటున 150 మందికి సీబీపీ పరీక్షలు అవసరమ వుతున్నాయి. ఇప్పటివరకు ఆస్పత్రిలో యంత్రం లేకపోవడంతో రక్త నమూనాలను సేకరించి జిల్లా కేంద్రంలోని డయాగ్నస్టిక్ కేంద్రానికి పంపించేవారు. దీంతో రిపోర్టుల కోసం రోగులు కొంత సమయం వేచి చూడాల్సి వచ్చేది. తాజాగా రూ.10 లక్షల విలువైన కంప్లీట్ బ్లడ్ పిక్చర్(సీబీపీ)యంత్రం అందుబాటులోకి రావడంతో ఈ ఇబ్బందులకు తెరపడనుంది. గంటకు సుమారు 100 పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉన్న ఈ యంత్రం 24 గంటలూ సేవలు అందించనుంది. సీబీపీ పరీక్ష కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేకపోవడంతో ఒక్కో రోగికి సుమారు రూ.300 వరకు ఖర్చు తగ్గనుంది. కొత్త యంత్రంతో నిర్ధారణ పరీక్షల వేగం పెరగడంతో ప్రభుత్వ ఆస్పత్రిపై ఆధారపడే పేద, మధ్యతరగతి కుటుంబాలకు మరింత ప్రయోజనం కలగనుంది.
ఎంసీహెచ్‌లో సీబీపీ యంత్రం
అందుబాటులోకి
పేషెంట్లకు తగ్గనున్న ఆర్థిక భారం


