మళ్లీ రేవూరినే గెలిపించాలి : సీఎం పిలుపు
సీఎం రేవంత్‌రెడ్డి ములుగు, పరకాల పర్యటన.. ఆద్యంతం ఆసక్తికరం
సాక్షి ప్రతినిధి, వరంగల్:
ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదివారం ములుగు, పరకాల పర్యటన అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ సందేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మేడారంలో వనదేవతలను దర్శించుకుని పింఛన్ల పంపిణీ మొదలుపెట్టారు. అక్కడినుంచి ములుగులో హ్యామ్‌రోడ్ల పైలాన్ ఆవిష్కరణ.. కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం.. చివరగా పరకాలలో ‘ప్రజాపాలన–ప్రగతిబాట’ విజయోత్సవ సభలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. విద్య, వైద్యం, రహదారులు, విద్యుత్, పట్టణ మౌలిక వసతులు, మహిళా సాధికారతకు సంబంధించిన పలు పనులకు శ్రీకారం చుట్టారు. రాజకీయ ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేసిన సీఎం.. సొంతపార్టీలోని అసంతృప్తులకూ చురకలు అంటించారు.
చర్చనీయాంశంగా రాజకీయ సందేశం..
పరకాల సభలో సీఎం ప్రసంగం అభివృద్ధి, సంక్షేమంతోపాటు రాజకీయ సందేశాలతోనూ సాగింది. ప్రజలనుంచి ఎన్నికై న ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవకులుగా పనిచేయాలన్నారు. ‘కేసీఆర్ ఫ్యామిలీ జస్టిస్ చేస్తే నేను సోషల్ జస్టిస్ చేస్తున్నా.. ఆనాడు కుటుంబసభ్యులకు పదవులు కట్టబెడితే, మేం సామాజిక కోణంలో అవకాశాలు కల్పిస్తున్నాం.. ఇలాంటి నేతలు మహిళలు, ప్రజలకు ఎలా న్యా యం చేస్తారు’ అంటూ ఘాటైన విమర్శలు చేశారు. పాలకుర్తిలాంటి చోట పాలన పరాకాష్టకు చేరి కొండలాంటి వ్యక్తులమని చెప్పుకున్న వారు ఎన్నికల్లో బండలా పగిలిపోయారని, ఇప్పటికై నా ప్రజల చైతన్యమే ప్రజాస్వామ్యానికి బలమని గ్రహించాలని పేర్కొన్నారు. సీఎం పర్యటనతో ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది.
ఓరుగల్లుపై వరాల జల్లు
వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మామునూరు విమానాశ్రయం కోసం భూసేకరణకు రూ.300 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నామని ప్రకటించారు. రెండేళ్లలో విమాన సర్వీసులు ప్రారంభించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. వరంగల్ నగరంలో సుమారు రూ.5,700 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సమర్థంగా సిద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్నామని, మిగిలిన ఖాళీలను దశలవారీగా భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు. ‘ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక 32 నెలల పాలనలో రోజూ మూడు గంటలైనా రెస్ట్ తీసుకోలేదు. ప్రజలు అండగా ఉంటే చాలు ఏదైనా సాధిస్తా’ అని రేవంత్ స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధనసరి సీతక్క,అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు కావ్య, వేం నరేందర్ రెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, రాంచంద్రునాయక్, మురళీనాయక్, ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వర్ణ, కలెక్టర్లు హేమంత్ సహదేవరావు, చాహత్ బాజ్‌పాయ్, డాక్టర్ సత్యశారద, సీపీ శ్వేత, ఎస్పీ రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు.
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందడి.. ఓరుగల్లుపై వరాల జల్లు
అభివృద్ధి, సంక్షేమ పథకాలపై హామీలు.. నిరుద్యోగులకు మార్గదర్శనం
రాజకీయ ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు
సొంతపార్టీ అసంతృప్తులకు చురకలు
సీఎం పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరం..
పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయాల్లో సీఎం రేవంత్‌రెడ్డి తాజా పిలుపు ఆసక్తికర చర్చకు తెరలేపింది. ముఖ్యమంత్రి పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి ప్రాధాన్యం దక్కగా.. మంత్రి కొండా సురేఖ ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున ప్రకాశ్‌రెడ్డిని మరోసారి గెలిపించాలని సీఎం ప్రజలకు పిలుపునివ్వడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో గతంలో రేవూరి, మంత్రి కొండా సురేఖ వర్గాల మధ్య విబేధాలు బహిర్గతమైన సందర్భాలున్నాయి. ఫ్లెక్సీల వివాదం ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. కాగా, మంత్రి సురేఖ గైర్హాజరుకు అధికారిక కారణం వెల్లడికాకపోవడంతో స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా.. ‘పరకాలలో రేవూరికే సీఎం అండ’ అన్న సంకేతాన్ని రేవంత్‌రెడ్డి పర్యటన ఇచ్చిందనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.


