జనగామ: శ్రావణ మాసం తొలి ఆదివారం సందర్భంగా పట్టణంలోని ఉప్పలమ్మ దేవాలయంలో అమ్మవారిని తామర పుష్పాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు వారణాసి పవన్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష అర్చనలు జరిపారు. తొలి ఆదివారం కావడంతో ఉదయం నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని, బోనాలను నైవేద్యంగా సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కుర్రెముల మోహన్, ఆలయ సిబ్బంది పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కాంగ్రెస్ పార్టీ వార్డు కమిటీల ఏర్పాటు షెడ్యూల్ విడుదల
జనగామ: కాంగ్రెస్ పట్టణ కమిటీ పరిధిలోని 30 వార్డులకు అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు టీమ్‌లను నియమించేందుకు పార్టీ అధిష్టానం షెడ్యూల్ విడుదల చేసినట్లు పట్టణ అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు వార్డుల వారీగా కమిటీల నిర్మాణ ప్రక్రియ కొనసాగనుంది. ప్రతీ వార్డుకు నిర్ణీత సమయాన్ని కేటాయించి కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 18వ తేదీన 1,2,3,4,5,19వ తేదీన 6,7,8,9,10, 20వ తేదీన 11,12,13,14,15, 16,17,18,19,20, 21వ తేదీన 21,22,23,24,25, 22వ తేదీన 26,27,28,29,30 తేదీల్లో వార్డు సమావేశాలు ఉంటాయన్నారు. పార్టీ కార్యకర్తలు, వార్డు స్థాయి నాయకులు నిర్ణీత సమయానికి హాజరై కమిటీల నిర్మాణ ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు. ప్రక్రియ పూర్తయిన అనంతరం పట్టణంలోని 30 వార్డులకు అధ్యక్షులు, కార్యదర్శులు, టీమ్‌ల సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు.
‘బొమ్మకూరు’ కుడి కాలువ నీటిని విడుదల చేయాలి
జనగామ రూరల్: మండలంలోని పెద్దపహడ్, గోపరాజుపల్లి, తమ్మడపల్లె, ఓబుల్ కేశవాపూర్ గ్రామాలకు చెందిన రైతులు బొమ్మకూర్ రిజర్వాయర్ కుడి కాలువ నీటిని విడుదల చేయాలని జనగామ– సిద్దిపేట జాతీయ రహదారి పెద్దపహడ్ క్రాస్‌రోడ్డు వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ.. బొమ్మకూరు రిజర్వాయర్‌లో సరిపడా నీటి నిల్వలు ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంతో నీటిని విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. తక్షణమే నీటిని విడుదల చేసి రైతులకు వరి నాట్లు ఎండిపోకుండా చూడాలని సంబంధిత అధికారులను కోరారు. 24గంటల్లో నీటిని విడుదల చేయని పక్షంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చ రించారు. కాగా, అధికారులు మూడు రోజుల్లో నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ధర్నాలో రైతులు గుండ్లపల్లి రవి, గద్ద చంద్రశేఖర్, బేజాడి సిద్దులు, రాజు, సంజయ్, సిద్దులు, గణేశ్, బాబు,శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
సమాజానికి జ్ఞానం
ఇవ్వడమే నిజమైన జీవితం
లింగాలఘణపురం: తాము పొందిన జ్ఞానం సమాజానికి తిరిగి ఇవ్వడమే నిజమైన జీవితమని, అదే దివంగత ప్రొఫెసర్ లక్ష్మినారాయణ నేర్పిన పాఠమని ఓయూ మాజీ వీసీ రవీందర్‌యాదవ్ అన్నారు. దివంగత ప్రొఫెసర్ లక్ష్మి నారాయణ స్వగ్రామమైన సిరిపురంలో ఆదివారం సిరిపురం డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ వీసీ రవీందర్‌యాదవ్ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ లక్ష్మినారాయణ విద్యావేత్తగా, మానవతావాదిగా, సమాజసేవలో ఎప్పుడూ ముందుండేవారన్నారు. నిరుపేదలకు విద్యను చేరువచేయాలనే లక్ష్యంతో ఉండేవారని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గ్రామంలోని పదో తరగతి విద్యార్థులకు ప్రొఫెసర్ లక్ష్మినారాయణ మెమోరియల్ స్కాలర్‌షిప్‌ను అందిస్తామని సిరిపురం డెవలప్‌మెంట్ ఫోరం ప్రకటించింది. కార్యక్రమంలో ఫ్రొఫెసర్లు చింత సాయిలు, సీహెచ్ భిక్షపతి, పరశురాములు, బుచ్చన్న, సర్పంచ్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.


