నర్సంపేట: బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇంటికి రానున్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. కష్టకాలంలో ఉన్న వారికి భరోసా ఇవ్వనున్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు కేసీఆర్ ఇప్పటికే ఆర్థిక సాయం ప్రకటించిన విషయం విదితమే.
ఈవీఎం గోదాం పరిశీలన
జనగామ రూరల్: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, నెలవారీ తనిఖీలో భాగంగా శనివారం కలెక్టర్ కార్యాలయంలోని ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పని తీరు, మంటల నియంత్రణ పద్ధతులను పర్యవేక్షించారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ పర్యటనకు నేడు అర్హత పరీక్ష
జనగామ: అంతర్జాతీయ విద్యా విధానాలపై అవగాహన పెంపొందించేందుకు రాష్ట్ర విద్యాశాఖ, ఎస్సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీచర్ ఎక్స్‌పోజర్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రాం ఫేజ్–2కు జిల్లా నుంచి ఐదుగురు ఉపాధ్యాయులను ఎంపిక చేయనున్నారు. ఇందు కోసం జిల్లాలోని అర్హులైన ఉపాధ్యాయుల నుంచి తొమ్మిది దరఖాస్తులు రాగా వీరిలో అర్హత, ప్రతిభ ఆధారంగా ఐదుగురిని ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోందని విద్యాశాఖ ఏడీ శ్రీనివాస్ తెలిపారు. ఇందులో భాగంగా నేడు (ఆదివారం) జనగామ సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అభ్యర్థులకు ఉదయం 11గంటలకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, ప్రతిభావంతులైన ఐదుగురు ఉపాధ్యాయులను అంతర్జాతీయ విద్యా పర్యటనకు ఎంపిక చేయనున్నారు.
హామీలు నెరవేర్చాలి
జనగామ రూరల్: ఎన్నికల హామీలు నెరవేర్చాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక డిమాండ్ చేశారు. శనివారం జిల్లాకేంద్రంలో జిల్లా అధ్యక్షుడు ఏదునూరి నరేష్ అధ్యక్షతన ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సాంబరాజు కుమార్, మామిడాల ప్రభాకర్, గట్టికొప్పుల సత్యనారాయణ, ఉల్లెంగుల వెంకటేశ్వర్లు, మిన్నలపురం జలంధర్, ఏదునూరి వీరన్న, రాములు, తదితరులు పాల్గొన్నారు.
తొలి తెలుగు విప్లవ కవి సోమనాథుడు
పాలకుర్తి టౌన్: తెలంగాణ ఆది కవి, తొలి తెలుగు విప్లవ కవి పాల్కురికి సోమనాథుడు నడియాడిన పాలకుర్తి ప్రాంతం సాహిత్య, సామాజిక పోరాట చరిత్రక ప్రతీకగా నిలిచిందని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఏఐసీసీటీయూ జాతీయ అధ్యక్షుడు కామ్రెడ్ వి.శంకర్ అన్నారు. శనివారం మండలకేంద్రంలోని పాల్కురికి సోమనాథుడు స్మారక స్మృతి కేంద్రాన్ని సందర్శించి సోమనాథుడి శిలా విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాల్కురికి సోమనాథుడి సాహిత్యం తెలుగు భాషలోనే కాకుండా సమాజ ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ కేంద్ర కమిటీ సభ్యులు ఎన్.మూర్తి, రాష్ట్ర కార్యదర్శి కవి, రచయిత మామిండ్ల రమేష్‌రాజా, గుమ్మడిరాజు సాంబయ్య, అనంతోజు రజిత పాల్గొన్నారు.


