పచ్చడి పిరమాయే! | - | Sakshi
Sakshi News home page

పచ్చడి పిరమాయే!

Apr 12 2026 3:42 AM | Updated on Apr 12 2026 3:42 AM

అదనపు భారం..

జనగామ: పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతల ప్రభావం దేశీయ మార్కెట్లపై తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా వంటనూనెల ధరలు విపరీతంగా పెరగడంతో పాటు పచ్చడి తయారీలో ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు మామిడి పచ్చడి తయారీ 50శాతం అదనపు భారంగా మారిపోయింది.

ధరలు ఇలా..

ఇటీవల కాలంలో కారంపొడి ధరలు గణనీయంగా పెరిగాయి. గతంలో కిలో రూ.680 వరకు లభించిన కారంపొడి ప్రస్తుతం రూ.780కి పైగా చేరింది. అదే సమయంలో వెల్లుల్లి ధరలు కూడా కిలో రూ.100 నుంచి రూ.170 వరకు భారీగా పెరగడంతో పచ్చడి తయారీ ఖర్చు మరింత పెరిగింది. వంటనూనెల ధరల పెరుగుదల ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. నెల రోజుల క్రితం లీటరు నూనె ధర రూ.130 ఉండగా, అది రూ.155కు చేరి ప్రస్తుతం రూ.150 వద్ద నిలిచింది. ఐదు లీటర్ల నూనె ధర గతంలో రూ.700 ఉండగా, రూ.750కు పెరిగి ప్రస్తుతం రూ.920లకు రిటేయిల్‌ మార్కెట్‌లో అమ్ముతున్నారు. అలాగే 15 లీటర్ల టిన్‌ ధర రూ.2,300 నుంచి రూ.2,450కు, ప్రస్తుతం రూ.2,670 వరకు పెరిగింది.

తగ్గిన మామిడి దిగుబడి

జిల్లాలో సుమారు 8 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నప్పటికీ, ఈ ఏడాది దిగుబడి తీవ్రంగా తగ్గింది. వాతావరణ మార్పులు, తక్కువ పంట ఉత్పత్తి కారణంగా మార్కెట్‌లో పచ్చడి కాయలకు తీవ్రమైన కొరత ఏర్పడింది. గతేడాది రూ.100కు 15 నుంచి 20 మామిడికాయలు లభించగా, ప్రస్తుతం అదే ధరకు కేవలం 5 కాయలే వస్తున్నాయి. చిన్న సైజు కాయలకు సైతం అధిక ధరలు పలుకుతుండగా, పెద్ద సైజు కాయలకు మరింత డిమాండ్‌ పెరిగింది.

2 కిలోలపై రూ.460 అదనపు భారం

పచ్చడి మామిడికాయల ధరలు అమాంతం పెరగడంతో ఈ సీజన్‌లో మామిడి పచ్చడి తయారీ సాధారణ ప్రజలకు భారంగా మారుతోంది. ప్రస్తుతం 10 మామిడికాయలు (సుమారు 2 కిలోల ముక్కలు)తో పచ్చడి తయారీకి సుమారు రూ.460 ఖర్చవుతుండగా, తాజా ధరల పెరుగుదలతో అదనంగా రూ.90 వరకు భారం పడుతోంది. ఇదే లెక్కన 100 కాయలతో పచ్చడి చేసే వారికి మొత్తం ఖర్చు రూ.4,560కు చేరుకోగా, అదనపు భారం సుమారు రూ.1000 వరకూ పెరుగుతుంది. మామి డికాయల సరఫరా తగ్గడం, డిమాండ్‌ పెరగడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. మరోవైపు వంటనూనె, వెల్లుల్లి, కారం వంటి అవసరమైన పదార్థాల ధరలు కూడా పెరుగుతుండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. ఈ వారం రోజుల్లో ధరలు ఇంకా పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు.

ఈ ధరల పెరుగుదలతో ఒక్కో కుటుంబంపై పచ్చడి తయారీకి సుమారు 50 శాతం అదనపు భారం పడుతోంది. ఇంట్లో ఇతర వంటకాలు లేకపోయినా పచ్చడితో రేషన్‌ బియ్యం కలిపి భోజనం చేసే పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో సర్వసాధారణం. మార్కెట్‌లో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పచ్చడి తయారీకి అవసరమైన పదార్థాల ధరలు కూడా పెరగడం ప్రజలపై అదనపు భారాన్ని మోపుతోంది. ఈ పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో పచ్చడి వంటి సాధారణ ఆహార పదార్థాలు కూడా సామాన్యులకు అందని వాటిగా మారే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారీగా పెరిగిన మామిడికాయలు, కారం, నూనె ధరలు

తగ్గిన మామిడి దిగుబడి..రూ.వందకు ఐదు కాయలు

వెల్లుల్లి, ఇతర సరుకుల ధరలు అదేతీరు

50శాతం అదనపు ఖర్చు

పచ్చడి మెతుకులకు కష్టకాలమే అంటున్న సామాన్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement