కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎంలోని డీ–అడిక్షన్ సెంటర్‌లో బాధితులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం డీ–అడిక్షన్ సెంటర్‌ను పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, వరంగల్ కలెక్టర్ సత్యశారద, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సెంటర్‌లో బాధితులకు అందిస్తున్న వైద్యసేవలు, సౌకర్యాలు, పునరావాసంపై అధికారులతో సమీక్షించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ వ్యసనాల నుంచి బయటపడేందుకు, మానసిక దృఢత్వం కోసం కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని ఆయన సూచించారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ ఎంజీంఎలోని డీ–అడిక్షన్ సెంటర్ సేవలను మరింత మెరుగుపరచాలన్నారు. బాధితులకు సమగ్ర సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, ఇటీవల నిర్వహించిన పలు పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి, హనుమకొండ డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి, సైకియాట్రిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ అశ్విన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ
పాలకుర్తి టౌన్: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో అంగన్‌వాడీ టీచర్ల పాత్ర కీలకమని, రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ వ్యవస్థను ఆధునీకరించేదిశగా చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్‌వాడీ టీచర్లకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్‌ఫోన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్మార్ట్‌ఫోన్ ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల వివరాలను సమయానుకులంగా నమోదు చేయగడం, పోషణ ఆరోగ్య సంబంధిత సేవలను అందించడం సులభమవుతుందన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ కోదండరాములు, మార్కెట్ చైర్‌పర్సన్ మంజుల, సీడీపీఓ సత్యవతి, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
గంజాయి సేవిస్తున్న
యువకుడి అరెస్ట్
జనగామ రూరల్: మండలంలోని చీటకోడూరు రోడ్డులో గంజాయి సేవిస్తున్న యువకుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ సత్యనారాయణరెడ్డి శనివారం తెలిపారు. శుక్రవారం చీటకోడూర్ రోడ్డులో గంజాయి సేవిస్తున్నారని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎస్సై భరత్ సిబ్బందితో వెళ్లి అక్కడ చూడగా ఇద్దరు వ్యక్తులు గంజాయి సేవిస్తున్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి ఆక్కడ నుంచి పారిపోయాడు. నిందితుల నుంచి 60 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని ఎస్సై నర్సయ్య కేసు రిజిస్టర్ చేసి, దర్యాఫ్తు ప్రారంభించి నిందితున్ని రిమాండ్ తరలించారు.
బుచ్చిబాబు జీవితం
సాహిత్యం పుస్తకావిష్కరణ
విద్యారణ్యపురి: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ రచించిన బుచ్చిబాబు జీవితం–సాహిత్యం పుస్తకావిష్కరణ కార్యక్రమం శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగింది. విశ్వనాథ సాహిత్యపీఠం వ్యవస్థాపకుడు వెలిశాల కొండల్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. రచయిత అంపశయ్య నవీన్, తెలుగుభాషా సాంస్కృతికశాఖ అధ్యక్షుడు ఏనుగు నర్సింహారెడ్డి, రచయితలు దర్శశయనం శ్రీనివాసచార్య, అశోక్‌కుమార్, నెల్లుట్ల రమాదేవి శశికిరణ్ పాల్గొన్నారు.


