● ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు
కీలక బాధ్యతలు
● సెల్ఫ్ ఎన్యుమరేషన్‌కు ముఖ్యమైన
నిబంధనలు
జనగామ: జిల్లాలో ఇంటింటి గణన ప్రక్రియ సర్వేకు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 280 గ్రామపంచాయతీల పరిధిలో మే 11 నుంచి జూన్ 9 వరకు జనగణనలో భాగంగా ఇంటింటి గణన చేపట్టనున్నారు. ఇందుకోసం జిల్లా పరిపాలన మొత్తం అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని 10శాతం రిజర్వుతో కలుపుకొని 994 మంది ఎన్యుమరేటర్లను ఎంపిక చేశారు. అలాగే పర్యవేక్షణ కోసం 174 మంది సూపర్‌వైజర్లను నియమించారు. ప్రతి సూపర్‌వైజర్‌కు ఆరుగురు ఎన్యుమరేటర్లతో కూడిన యూనిట్‌ను ఏర్పాటు చేస్తారు. ఎన్యుమరేటర్లు ఒక్కొక్కరికీ సుమారు 300 ఇళ్ల (దాదాపు 800 జనాభా) గణన బాధ్యతను అప్పగిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అదనపు ఎన్యుమరేటర్లను నియమించేందుకు కూడా అధికార యంత్రాంగం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే ఏడాది అధికారిక జనగణన ప్రారంభం కానుండగా, ఈ ప్రాథమిక గణన పనులను జిల్లా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇంటింటి గణన నేపథ్యంలో ఈ నెల18వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఎన్యుమరేటర్ల బాధ్యతలు
ఇంటింటి గణనను కచ్చితంగా, పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు ఎన్యుమరేటర్లు అనుసరించాల్సిన పలు ముఖ్యమైన సూచనలు వెల్లడించారు. గణనకు ముందు ట్రైనింగ్‌లో పాల్గొని, యూజర్స్ మాన్యువల్‌ను అధ్యయనం చేయడం, అలాగే హెచ్‌ఎల్‌ఓ మొబైల్ యాప్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ (హెచ్‌ఎల్‌బీ)లోని ప్రతి భవనం, ప్రతి కుటుంబం, ప్రతి గృహాన్ని సందర్శించి వివరాలు సేకరించాలి. నెంబర్ లేని భవనాలకు నెంబర్లు కేటాయించి, యాప్‌లో ఉన్న మ్యాప్ ద్వారా హెచ్‌ఎల్‌బీ లే అవుట్ మ్యాప్ సిద్ధం చేయాలి. హెచ్‌ఎల్‌ఓ యాప్ ద్వారా హౌస్ లిస్టింగ్ వివరాలు నమోదు చేసి, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీఈలు ధ్రువీకరించి, వివరాలను నిరంతరం సింక్ చేయాలి. కేటాయించిన ప్రాంతంలో పూర్తి కవరేజ్ చేయడంతో పాటు వివరాలను అప్‌లోడ్ చేసి, బ్లాక్ పూర్తయిందని సూపర్‌వైజర్‌కు తెలియజేయాలి.
సూపర్‌వైజర్ల బాధ్యతలు
ఎన్యుమరేటర్ల పనితీరును పర్యవేక్షిస్తూ, గణన ప్రక్రియను మరింత సమర్థవంతంగా చేసేందుకు సూపర్ వైజర్లకు పలు బాధ్యతలు అప్పగించారు. భూ భాగంలో హెచ్‌ఎల్‌బీ సరిహద్దులు, గుర్తింపు సూచనలు పరిశీలించి అవసరమైన మార్పులను సంబంధిత అధికారికి తెలియజేయాలి. మొత్తం సూపర్ వైజర్ సర్కిల్‌ను కవర్ చేసేలా లేఅవుట్ మ్యాప్ సిద్ధం చేయాలి. ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ చేస్తూ, సూపర్‌వైజర్ యాప్ ద్వారా ఎన్యుమరేటర్ల నమోదు చేసిన డేటాను మానిటర్ చేయాలి. హెచ్‌ఎల్‌బీ విభజనలో ఎక్కడా గ్యాప్‌లు లేకుండా, పూర్తిగా కవరేజ్ అయ్యేలా పర్యవేక్షించాలి. పేపర్ మోడ్‌లో వచ్చిన డేటాను సమయానుసారం వెబ్ పోర్టల్‌లో నమోదు చేయాలి.
సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఎలా
2027 జనగణనలో ప్రజలు ఆన్‌లైన్‌లో స్వతహాగా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ గైడ్‌లైన్స్ జారీ చేశారు. కేంద్రం అధికారిక పోర్టల్ ద్వారా 16 భాషల్లో దీనిని అందుబాటులో ఉంచింది.
సెల్ఫ్ ఎన్యుమరేషన్ ముఖ్యమైన నిబంధనలు
అధికారిక se.census.gov.in పోర్టల్‌లో మొబైల్ నెంబర్, ఓటీపీ ద్వారా నమోదు చేసుకోవాలి. ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చే తేదీకి 15 రోజుల ముందుగా వివరాలు పూర్తి చేయాలి. కుటుంబ పెద్ద పేరు (మార్చడానికి వీలుండదు). అలాగే కుటుంబ సభ్యుల వివరాలు, చిరునామా కచ్చితంగా నమోదు చేయా లి. ఒక కుటుంబానికి ఒకే మొబైల్ నెంబర్ ఉపయోగించాలి. ఎస్‌ఈఐడీ వివరాలు సమర్పించిన తర్వాత వచ్చే సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐటీ (ఎస్‌ఈ ఐడీ)ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆన్‌లైన్‌లో వివరాలను నింపినప్పటికీ, ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఎస్‌ఈ ఐడీని చూపించి ఫామ్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఈ విధానం జనాభా లెక్కల ప్రక్రియను వేగవంతం, సులభతరం చేస్తుంది. ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చి సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు.


