నేడు మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి | - | Sakshi
Sakshi News home page

నేడు మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి

Apr 11 2026 8:16 AM | Updated on Apr 11 2026 8:16 AM

జనగామ: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ సమావేశం హాల్‌లో సామాజిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని నేడు(శనివారం) నిర్వహించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎన్‌ఎల్‌ నరసింహరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, వెనుకబడిన తరగతుల కుల సంఘం నాయకులు, ప్రతినిధులు, ఇతర కుల సంఘాల నాయకులు హాజరు కావాలని కోరారు.

మార్క్‌ఫెడ్‌, ఐకేపీ సెంటర్‌ ఏర్పాటు చేయాలి

జనగామ రూరల్‌: జనగామ వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్‌, ఐకేపీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మొక్కజొన్న, ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్‌ చేశారు. మార్కెట్‌లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం కనకారెడ్డి మాట్లాడుతూ.. మార్క్‌ఫెడ్‌, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తుండడంతో రైతులకు మద్దతు ధర రావడం లేదన్నారు. ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సాంబరాజు యాదగిరి, ఇర్రి అహల్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చందు నాయక్‌, సుంచు విజేందర్‌ బూడిద గోపి, ఉపేందర్‌, బోడ నరేందర్‌, మహేందర్‌ తదితులు ఉన్నారు. అంతకుముందు మార్కెట్‌ ప్రత్యేక శ్రేణి కార్యదర్శికి పలు డిమాండ్లతో వినతి పత్రం అందించారు.

హెచ్‌పీవీ టీకాతో సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణ

జనగామ: జిల్లాలో సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణలో భాగంగా హెచ్‌పీవీ (హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌) టీకా కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోందని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మల్లికార్జున్‌ రావు తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డీఎల్సీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు.. జిల్లాకు ఇప్పటివరకు 625 మందికి టీకాలు వేసినట్లు తెలి పారు. ఈ కార్యక్రమం ద్వారా బాలికల్లో ఆరో గ్య అవగాహన పెంచడంతో పాటు భవిష్యత్‌లో వచ్చే సర్వైకల్‌ క్యాన్సర్‌ వంటి ప్రమాదకర వ్యాధులను నివారించడం లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో డీసీ హెచ్‌ఎస్‌ డాక్టర్‌ నరేంద్ర శర్మ, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజలింగం, డీడబ్ల్యూఓ కోదండరాములు, విద్యా శాఖ ఏడీ సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

యోగాతో ఆరోగ్యం

జనగామ: ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హోమియోపతి, ఆయుష్‌ దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం పట్టణంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో యోగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు యోగా సాధన చేయించారు. అనంతరం జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మల్లికార్జున్‌రావు మాట్లాడుతూ.. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో యోగా సాధనను అలవాటు చేసుకోవాలని సూచించారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజలింగం, విద్యా శాఖ ఏడీ సత్యనారాయణ మూర్తి, ఆయుష్‌, ఇతర సంబంధిత వైద్యాధికారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

అదృశ్యమైన వ్యక్తి అప్పగింత

రఘునాథపల్లి: మండల కేంద్రానికి చెందిన గుంటల ప్రభాస్‌ మతిస్థిమితం కోల్పోయి గత నెల 29న కనిపించకుండా పోయాడు. ఈ మేరకు అతడి తల్లి గుంటల పవిత్ర ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని రెంజల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి లో ప్రభాస్‌ను గుర్తించారు. 13 రోజుల లోపే అతన్ని సురక్షితంగా తీసుకొచ్చి తల్లికి అప్పగించినట్లు ఎస్సై నరేష్‌ శుక్రవారం తెలిపారు. కేసు విచారణలో చురుకుగా వ్యవహరించిన హెడ్‌కానిస్టేబుల్‌ పోతుల శ్రీనివాస్‌, కానిస్టేబుల్‌ రాజకుమార్‌ను అధికారులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement