జనగామ: చంపక్‌హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో శిశువు అపహరణ కేసులో అరైస్టెన మహిళపై విచారణలో లింగనిర్ధారణ పరీక్షలు వెలుగులోకి వచ్చాయి. ఆమె గర్భిణిగా ఉన్నప్పుడు లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకొందన్న అనుమానాలు పోలీసు విచారణలో వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది. లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధించి కఠిన శిక్షలు విధించే చట్టం అమలులో ఉన్నప్పటికీ, కొన్ని స్కానింగ్ సెంటర్లు ఇంకా ఈ దందాను కొనసాగిస్తున్నాయన్న అనుమానాలకు ఈ ఘటన బలం చేకూర్చింది.
స్కానింగ్ తీసింది ఎక్కడ..?
ఎంసీహెచ్‌లో శిశువు అపహరణ కేసులో అరైస్టెన మహిళను పోలీసులు 24 గంటలకంటే ఎక్కువగా కస్టడీలో ఉంచుకోలేకపోవడంతో, ఈ నెల 9న రిమాండ్ పంపిన సంగతి తెలిసిందే. అయితే లింగ నిర్ధారణకు సంబంధించి కీలక సమాచారం బయటపట్టేందుకు ఆమెను మరోసారి పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు. మహిళ కస్టడీలోకి తిరిగి వస్తే, స్కానింగ్ ఎవరు చేశారు? ఎక్కడ చేశారు? అన్న వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని విచారణ అధికారులు భావిస్తున్నారు. జనగామలోనే పరీక్ష జరిగిందా లేదా మరెక్కడైనా లింగ నిర్ధారణ చేయించుకున్నారా అనే ప్రశ్నలకు కూడా సమాధానాలు దొరకొచ్చని అంచనా వేసుకుంటున్నారు. లింగ నిర్ధారణ మాఫియాలో ఎవరెవరున్నారు, సూత్రధారులు ఎవరు, కమీషన్ ఏజెంట్లు ఎలా పనిచేస్తున్నారు వంటి కీలక ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మహిళ మరోసారి పోలీస్ కస్టడీకి వస్తే ఈ దందా వెనుక ఉన్న నెట్‌వర్క్ బయటపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
లింగనిర్ధారణ చేస్తే కఠిన చర్యలు..
శిశువును అపహరించిన మహిళ గర్భిణి అయినప్పటికీ ఆరోగ్యశాఖ సూచించిన నమోదు చేయించుకోకుండా, ప్రైవేట్‌గా పరీక్షలు, చికిత్స పొందినట్టు తెలిసింది. లింగనిర్ధారణ, అబార్షన్ ఎవరు నిర్వహించారో పోలీసులు నిర్ధారించిన తర్వాత చర్యలు ఉంటాయని డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు తెలిపారు. స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు.
స్కానింగ్ తీసింది ఎక్కడ?
బిడ్డను ఎత్తుకెళ్లిన ఘటనతో వెలుగులోకి చీకటి దందా
పోలీసుల కస్టడీకి మహిళ వస్తే మరిన్ని విషయాలు బహిర్గతం


