● ఈనెల 13 నుంచి 18 వరకు
అరైవ్ అలైవ్ కార్యక్రమం
● సమీక్షలో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
జనగామ రూరల్: ప్రజల భద్రతే ప్రభుత్వ ధ్యేయమని, ప్రాణ రక్షణే ప్రథమ కర్తవ్యమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్–అలైవ్ కార్యక్రమం అమలుపై తన చాంబర్‌లో కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 13 నుంచి 18 వరకు చేపట్టనున్న అరైవ్–అలైవ్ కార్యక్రమాలను జిల్లాలో విస్తృత స్థాయిలో నిర్వహించాలన్నారు. 13న అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. పోలీస్, రవాణా, వైద్యారోగ్య, విద్యా, మిగతా అన్ని శాఖలు సమన్వయంతో గ్రామాలతో పాటు మున్సిపాలిటీల్లో ప్రజలను భాగస్వాములను చేస్తూ, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు, వ్యాసరచన, వక్తృత్వ, డ్రాయింగ్ పోటీలను విద్యా శాఖ నిర్వహించాలని సూచించారు. సమీక్ష సమావేశంలో ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, ఆర్డీఓ వెంకన్న, ఆయా శాఖల ఉన్నతాధికారులు శ్రీనివాస్, సత్యనారాయణ మూర్తి, అనిత, ఆర్టీఏ సభ్యులు అభిగౌడ్ సంబంధిత అధికారులు ఉన్నారు.
ఎరువుల యాప్‌ను వినియోగించుకోవాలి..
వానాకాలం పంటల సాగు కోసం రైతులకు అందుబాటులో ఉన్న ఎరువుల బుకింగ్ యాప్ సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకునే దిశగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టబోతున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎరువుల బుకింగ్ యాప్‌లో రైతుల మొబైల్ నంబర్ మార్పుచేర్పుల కోసం గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రత్యేక షెడ్యూల్ రూపొందించాలన్నారు. జిల్లాలోని ప్రతీ గ్రామానికి నిర్ణీత తేదీలు కేటాయించబడిన ఈ షెడ్యూల్ ప్రకారం, ఆయా గ్రామాల్లో మొబైల్ నెంబర్ సవరణ కార్యక్రమం నిర్వహించాలన్నారు. అలాగే ప్రభుత్వ పథకాల వివరాలు సమయానుకూలంగా రైతులకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.


