● విజయ డెయిరీ పురోగతికి
రూ.100 కోట్ల కేటాయింపు
● టీజీడీడీసీఎఫ్ రాష్ట్ర చైర్మన్
గుత్తా అమిత్‌రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
దేవరుప్పుల: పాడిపరిశ్రమను విస్మరిస్తే భవిష్యత్తు తరాలకు అనారోగ్యం తప్పదని తెలంగాణ పాడిపరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్(టీజీడీడీసీఎఫ్) గుత్తా అమిత్‌రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఎస్‌డీఎఫ్ నిధుల కింద రూ.8లక్షలతో నిర్మించిన పాల ఉత్పత్తిదారుల సంఘ భవనం(విజయ డెయిరీ)ను వారిద్దరు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి విజయ డెయిరీ జిల్లా చైర్మన్ కాసారపు ధర్మారెడ్డి అధ్యక్షత వహించారు. అమిత్ రెడ్డి, యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి పాడిపరిశ్రమ పురోగతి కోసం వంద కోట్ల నిధులను విజయ డెయిరీ ఫెడరేషన్‌కు కేటాయించడం శుభపరిణాణమన్నారు. త్వరలోనే పాడిపరిశ్రమను ప్రోత్సహించే దిశలో ఆసక్తి ఉన్న మహిళలకు రాయితీతో కూడిన పాడిగేదెల పథకం వర్తింపజేస్తామన్నారు. స్థానిక సర్పంచ్ కృష్ణమూర్తి గౌడ్‌తో పాటు డెయిరీ ప్రతినిధుల విజ్ఢప్తి మేరకు రెండు పాల ఉత్పత్తి భవనాలతోపాటు మండల సమాఖ్య భవన నిర్మాణ పనుల పూర్తి కోసం నిధులు కేటాయిస్తాననీ హామీ ఇచ్చారు. అనంతరం కామారెడ్డిగూడెం పాలశీతలీకరణ కేంద్రాన్ని అమిత్‌రెడ్డి బృందం సందర్శించి పాడిరైతులతో ముఖాముఖి నిర్వహించింది. విజయ డెయిరీ జనగామ డీడీ ఎన్ గోపాల్‌సింగ్, మేనేజర్ లక్ష్మీ, కామారెడ్డిగూడెం డెయిరీ చైర్మన్ గులాం రసూల్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పాండు, మండల అధ్యక్షుడు శ్రీరామ్, ఉప్పలయ్య, యాకస్వామి, గంగరాజు, పుల్లయ్య పాల్గొన్నారు.


