బచ్చన్నపేట: మండల కేంద్రంలోని అప్‌గ్రేడెడ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీహెచ్‌సీ) ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు లభించిందని మండల వైద్యాధికారి డాక్టర్ సృజన తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో 14 రకాల జాతీయ ఆరోగ్య సేవా కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టామన్నారు. రిజిస్ట్రేషన్, డెలివరీ, ఇమ్యునైజేషన్, ఎన్‌సీడీ, సీడీ, టీబీ, ఫ్యామిలీ ప్లానింగ్, ఎమర్జెన్సీ హెల్త్‌కేర్ తదితర కార్యక్రమాలను సకాలంలో చేశామన్నారు. మలేరియా, డెంగ్యూ జ్వరాలు ప్రబలకుండా గ్రామాల్లో ముందస్తు శానిటేషన్ పనులను చేయించడానికి ఆయా గ్రామాల సర్పంచ్‌లను ప్రోత్సహించామన్నారు. రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీ ఆసుపత్రుల కంటే మెరుగ్గా పనిచేసి వైద్యసేవలను అందించినందుకు గానూ ఆసుపత్రికి రాష్ట్ర స్థాయి ఉత్తమ సేవా పురస్కారం దక్కిందన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా మెమొంటో, సర్టిఫికెట్‌ను స్వీకరించినట్లు చెప్పారు. అవార్డు రావడానికి కృషి చేసిన డాక్టర్లు, వైద్య సిబ్బందిని ఆమె అభినందించారు. కార్యక్రమంలో వైద్యులు లక్ష్మిప్రసన్నకృష్ణ, సిద్దిసుదర్శన్‌రెడ్డి, స్టెల్లా, సీహెచ్‌ఓ జంగమ్మ, హెచ్‌సీ జాస్మిన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి ఉత్తమ సేవా పురస్కారం


