జనగామ రూరల్: తెలంగాణ విద్యాకమిషన్ సమర్పించిన విధానపత్రంలోని పలు అసంబద్ధ సిఫార్సులను తక్షణమే తొలిగించాలని ఏపీటీఎఫ్ పూర్వాధ్యక్షుడు ఎ.నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. టీపీటీఎఫ్ జిల్లా సబ్ కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు ఎన్‌ఎన్ రాజు అధ్యక్షతన పట్టణంలోని ఉమాపతి భవన్‌లో జరిగింది. ఈసందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల ఉత్తీర్ణత మార్కులను 45 శాతానికి పెంచడమనేది విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసేదిగా ఉందని, ఫలితంగా డ్రాపౌట్లు పెరిగే ప్రమాదముందన్నారు. వివిధ ప్రవేశ పరీక్షల రద్దు అనేది కార్పొరేట్ విద్యాసంస్థలకు ఊతమిచ్చేదిగా ఉందన్నారు. పేద విద్యార్థులకు అందజేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు చేయాలని అనడం సమంజసం కాదన్నారు. ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువని, జీతం కోతపెట్టాలని సూచించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంకుశావళి, జిల్లా పూర్వ అధ్యక్షుడు బి లక్ష్మయ్య, జిల్లా బాధ్యులు శారద, కవిత, రాజారెడ్డి, లక్ష్మణ్ జి, రాజేందర్, వెంకన్న, శ్రీహరి, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


