సోమనాథుడికి దీపారాధన | - | Sakshi
Sakshi News home page

సోమనాథుడికి దీపారాధన

Mar 4 2026 7:45 AM | Updated on Mar 4 2026 7:45 AM

పాలకుర్తి టౌన్‌: తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుడి 787వ దీపారాధన మంగళవారం పాలకుర్తిలోని సోమనాథ స్మృతివనంలో మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సోమనాథ కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాపోలు సత్యనారాయణ అధ్యక్షత వహించగా పోతన సాహిత్య కళా వేదిక అధ్యక్షుడు మాన్యపు భుజేందర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేవస్థాన ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న శివాచార్య సంయోజకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో వీరమనేని వేంకటేశ్వరరావు, మార్గం లక్ష్మీనారాయణ, ఇమ్మడి దామోదర్‌, బజ్జూరి వేణుగోపాల్‌, మేరుగు మధుసూదన్‌, కూరపాటి సుదర్శన్‌, సింగ మహేందర్‌ రాజు, గూడూరు నిరంజన్‌, బెల్లి యాకయ్య, మమత తదితరులు పాల్గొన్నారు.

6న ఉద్యోగ మేళా

జనగామ: జిల్లా ఉద్యోగ కల్పన శాఖ, డీఆర్డీఏ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలను అందించేందుకు ప్రైవేట్‌ జాబ్స్‌ ప్లేస్‌మెంట్స్‌ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఈ నెల 6వ తేదీ (శుక్రవారం) ఉదయం 10.30 గంటలకు జనగామ మున్సిపల్‌ కాంప్లెక్స్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉద్యోగ మేళాలో ప్రముఖ పరిశ్రమ సంస్థ మహీంద్రా, మహీంద్రా లిమిటెడ్‌ తన జహీరాబాద్‌ ఆటోమోటివ్‌ విభాగంలో ఖాళీగా ఉన్న 300 అప్రెంటిస్‌షిప్‌ పోస్టులను భర్తీ చేయనుంది. పురుషులు, మహిళలు ఇద్దరూ హాజరుకావచ్చు. అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్‌, విద్యార్హత సర్టిఫికెట్లు, అవసరమైన ఇతర పత్రాలు తీసుకుని ఇంటర్వ్యూకు హాజరవ్వాలని జిల్లా ఉద్యోగ కల్పనాధికారి పి.సాహితి సూచించారు. ఉద్యోగ మేళా పూర్తిగా ఉచితం కాగా, ఆసక్తిగల యువత ఈ అ వకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. మరింత సమాచారం కోసం 7995430401, 9948695910 నంబర్లలో సంప్రదించాలన్నారు.

నిట్‌తో ఎన్‌ఐజీఎస్‌టీ ఎంఓయూ

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌తో ఎన్‌ఐజీఐఎస్‌టీ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జియో ఇన్ఫర్మేటిక్స్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ) సర్వే ఆఫ్‌ ఇండియా మంగళవారం పరస్పర ఒప్పందం కుదుర్చుకుంది. నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ, ఎన్‌ఐజీఎస్‌టీ డైరెక్టర్‌, సీనియర్‌ అధి కారి బీసీ పరీదా పరస్పరం ఎంఓయూ పత్రాలను మార్చుకున్నారు. కార్యక్రమంలో ఎన్‌ఐజీఎస్టీ ప్రతినిధులు నిత్యానందం, వెంకయ్యచౌదరి, నిట్‌ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

బ్యాంకు పేరిట నకిలీ పత్రాలు సృష్టించిన టీచర్‌?

కాళోజీ సెంటర్‌: ప్రతీ ఆర్థిక సంవత్సరం ఉద్యోగులు ఆదాయ పన్ను లెక్కలు సమర్పించడం సాధారణ ప్రక్రియ. అయితే ఇందుకు సంబంధించిన ఓ ఉపాధ్యాయుడు ఏకంగా ఓ ప్రముఖ జాతీయ బ్యాంకు పత్రాలను సృష్టించి ఆదాయ పన్ను శాఖ అధికారులను పక్కదోవ పట్టించినట్లు సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలంలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యారుణంపై భారీ మొత్తంలో వడ్డీ చెల్లించినట్లు చూపుతూ సుమారు రూ.8.10 లక్షల మేర నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించి లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణలు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై బ్యాంకు అధికారులు విచారణ చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపడితే అసలు విషయం వెలుగులోకి రావడమే కాకుండా మరి కొంతమంది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయమై కాంప్లెక్స్‌ హెచ్‌ఎంను వివరణ కోరగా ఈ విషయం మా దృష్టికి రాలేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement