గృహహింస కేసుల్లో మహిళలకు ‘భరోసా’
జనగామ: రాష్ట్రంలో 34వ భరోసా సెంటర్‌ను జిల్లా హెడ్‌క్వార్టర్‌లో ప్రారంభించించినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మహిళలకు సంబంధించిన గృహహింస, చైల్డ్ హరాస్మెంట్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు నేరుగా పోలీస్ స్టేషన్ రావడంలో సంకోచించే సందర్భాల్లో భరోసా సెంటర్ సమగ్ర సహాయాన్ని అందిస్తుందన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని హన్మకొండరోడ్డులో ఏసీపీ కార్యాలయం ఏరియాలో నూతనంగా నిర్మించిన భరోసా, షీటీం నూతన భవన సముదాయాలను సీపీ సన్‌ప్రీత్‌సింగ్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, డీసీపీలు రాజమహేంద్ర నాయక్, అంకిత్‌కుమార్, కవితతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. అంతకు ముందు సీపీ, డీసీపీ డీజీపీకి ఘన స్వాగతం పలుకగా, కలెక్టర్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం భరోసా సెంటర్‌లోని కౌన్సిలింగ్ చాంబర్‌లను పరిశీలించి, పై అంతస్తులోని షీటీం భవనాన్ని ప్రారంభించారు. తదనంతనం భరోసా సెంటర్ ఆవరణలో డీజీపీ, సీపీ, కలెక్టర్ మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడారు.. హైదరాబాద్‌లో పదేళ్ల క్రితం ప్రారంభించిన భరోసా సెంటర్ వ్యవస్థ రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు ఇస్తోందని తెలిపారు. భరోసా సెంటర్‌లో ఇన్‌చార్జ్ లీగల్ అడ్వైజర్, మెడికల్ సపోర్టర్, ఇద్దరు సపోర్ట్ సిబ్బంది, లాయర్లు, సైకాలజిస్టులు, సోషల్ వర్కర్లు బాధితుల సమస్యలను విని, కేసు నమోదు నుంచి చార్జిషీట్ దాఖలు వరకు పోలీసులకు అవసరమైన సమాచారాన్ని అందజేస్తారని, కోర్టు ట్రయల్ సమయంలో కూడా భరోసా సెంటర్ అండగా నిలుస్తుందని వివరించారు. అంతుకు ముందు షీటీం కార్యాలయంలో సేవలపై డీజీపీ ఆరా తీశారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్–అలైవ్’
రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రాష్ట్రంలో 8వేల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్ల కనెక్టివిటీ, వాహనాల స్పీడు పెరగడం, డ్రైవర్లలో ప్రాథమిక డ్రైవింగ్ టెక్నిక్స్ లోపం ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలు సంప్రదాయ కార్యక్రమంలా మారిపోయిందని, దీనిపై ప్రజల్లో మరింత అవగాహన పెంచే మాదిరిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతినెల చివరి వారం రాష్ట్ర వ్యాప్తంగా ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గతేడాది చేసిన ప్రత్యేక చర్యలతో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గిందని, అయితే ప్రమాదాలు పెరిగాయని, ఇవి రెండూ తగ్గేలా చర్యలు కొనసాగిస్తామని చెప్పారు. జనగామ హెడ్‌క్వార్టర్‌లో డీసీపీ నూతన భవనం నిర్మాణం, రూరల్ పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన ఫైల్ కూడా త్వరలోనే కార్యరూపం దాల్చనున్నట్లు డీజీపీ ప్రకటించారు. కార్యక్రమంలో ఏసీపీలు భీంశర్మ, నర్సయ్య, రవీందర్‌రెడ్డి, సతీష్‌బాబు, నర్సింహారావు, ఎస్‌బీ ఏసీపీలు ఎం.జితేందర్‌రెడ్డి, జానీ నర్సింహులు, సీఐలు సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అబ్బయ్య, ఎస్సై, పోలీసులు ఉన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు
‘అరైవ్–అలైవ్’ ప్రోగ్రాం
భరోసా సెంటర్, షీటీం నూతన
భవనాలు ప్రారంభించిన
డీజీపీ శివధర్ రెడ్డి
గృహహింస కేసుల్లో మహిళలకు ‘భరోసా’


