3 నుంచి వార్డుల్లోకి.. | - | Sakshi
Sakshi News home page

3 నుంచి వార్డుల్లోకి..

Feb 28 2026 7:16 AM | Updated on Feb 28 2026 7:16 AM

3 నుంచి వార్డుల్లోకి..

3 నుంచి వార్డుల్లోకి..

జనగామ: పట్టణంలో అభివృద్ధి వేగవంతం చేసేందుకు నూతన చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణి వచ్చేనెల 3వ తేదీ నుంచి ‘మన చైర్‌పర్సన్‌..మన వార్డు’ సందర్శనకు శ్రీకారం చుట్టారు. పట్టణ సమస్యలను ప్రత్యక్షంగా గుర్తించి, తక్షణ పరిష్కారాల కోసం ప్రత్యేక పర్యటన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. మొదటి వార్డు నుంచి 30వ వార్డు వరకు ప్రతీ రోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు కాలనీల్లో పాదయాత్రగా పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్శనల్లో వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్‌ కమిషనర్‌, అధికారులు, సీనియర్‌ నాయకులు పాల్గొంటారు.

అభివృద్ధిపై ఫోకస్‌..

పట్టణ అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి అడుగు వేస్తున్నామని చైర్‌పర్సన్‌ ప్రకటించారు. పట్టణంలో పారిశుధ్యం, రోడ్లు, కాలువల శుభ్రత, వీధిదీపాలు, నాణ్యమైన తాగునీటి సరఫరా, పౌర సేవల మెరుగుదల వంటి అన్ని రంగాల్లో సమగ్ర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాపాలన బాటలో పరిపాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

టౌన్‌ ప్లానింగ్‌లో సమస్యలు

టౌన్‌ ప్లానింగ్‌ సమస్యలపై వచ్చే వారం ప్రత్యేక సమీక్ష నిర్వహించవలసిందిగా కమిషనర్‌ను ఆదేశించినట్లు చెప్పారు. టౌన్‌ ప్లానింగ్‌ సెక్షన్‌లో ప్రజలు చాలా వరకు ఇబ్బందులకు గురవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇక నుంచి మరింత పారదర్శకత ఉండేలా చూస్తామంటూ హామీ ఇచ్చారు.

చైర్‌పర్సన్‌ బాధ్యతల స్వీకరణ

జనగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కడకంచి బాలమణిశ్రీనివాస్‌, శుక్రవారం అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. బాణాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు క్రిష్ణమాచారి సిద్ధాంతి మంత్రోచ్ఛరణల మధ్య ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో కుర్చీలో కూర్చుని సంతకం చేశారు. అంతకు ముందు ఎంపీ, కొమ్మూరి, ప్రశాంత్‌రెడ్డి, టీపీసీసీ సభ్యుడు లక్ష్మినారాయణనాయక్‌, పార్టీ కేడర్‌తో కలిసి భారీ ర్యాలీ, మేళతాళాల నడుమ ఊరేగింపుగా మున్సిపల్‌కు చేరుకున్నారు. పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకునేలా పనిచేయాలని ఎంపీ, కొమ్మూరి ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి చైర్‌పర్సన్‌ చాంబర్‌కు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement