గద్వాల్‌కు రిజ్వాన్ బాషా
కుత్బుల్లాపూర్
జోనల్ కమిషనర్‌గా పింకేశ్
జనగామ: జిల్లా అభివృద్ధికి తనదైన ముద్ర వేసిన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జోగుళాంబ గద్వాల్ జిల్లాకు బదిలీ అయ్యారు. రెండేళ్ల పదవీ కాలంలో విద్య, వైద్యం, సంక్షేమం, నీటి సంరక్షణ, పారదర్శక పరిపాలన రంగాల్లో జిల్లా పేరును రాష్ట్ర, జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన కలెక్టర్‌గా ఆయన రుజువు చేసుకున్నారు. 2024 ఫిబ్రవరి 24న కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న రిజ్వాన్ బాషా.. సరిగ్గా రెండేళ్ల పాటు ఇక్కడ పని చేశారు.
జాతీయ, రాష్ట్రస్థాయిల్లో గుర్తింపు
జిల్లాలో చేపట్టిన ‘మన జిల్లా–మన నీరు’ కార్యక్రమానికి 2025లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ చేతుల మీదుగా జల్ సంచాయ్, జన్ భాగీధారీ 1.0 అవార్డు, జల్ ప్రహరీ సమ్మాన్ అందుకున్నారు. ఆర్‌టీఐ దరఖాస్తులను వేగంగా పరిష్కరించడంలో 2025లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఉత్తమ జిల్లా అవార్డు లభించింది. అలాగే 2026 జనవరిలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ చేతుల మీదుగా ఉత్తమ జిల్లా పురస్కారం లభించింది. జాతీయ స్థాయిలో న్యాస్–2024లో 3వ తరగతిలో దేశంలో 16వ స్థానం, 6వ తరగతిలో 35వ స్థానం, 9వ తరగతిలో 33వ స్థానం సాధించడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో జనగామ జిల్లా మాత్రమే జాతీయ ర్యాంకుల్లో స్థానం సంపాదించింది. ఈ విజయానికి గుర్తింపుగా 2025 సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
జిల్లా అభివృద్ధికి తమ వంతు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ, గద్వాల్ జిల్లాలోనూ ప్రజాసేవలో అదే ఒరవడిని కొనసాగిస్తానని కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. జిల్లాలో అభివృద్ధి, పారదర్శక పరిపాలనకు ప్రతీకగా నిలిచిన కలెక్టర్ సేవలను గుర్తుచేసుకుంటూ ప్రజలు, అధికారులు అభినందనలు తెలియజేశారు. కాగా కాన్ఫరెన్స్ హాలులో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీహరితో పాటు డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఆర్డీఓ వెంకన్న, ఉన్నతాధికారులు బదిలీపై వెళ్లిన కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్‌లను సత్కరించారు.
జనగామ జిల్లాలో అడిషనల్ కలెక్టర్, విద్యాశాఖ అధికారి(లోకల్ బాడీస్) గా బాధ్యతలు నిర్వర్తిస్త్తున్న పింకేష్ కుమార్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆ దేశాలు జారీ చేసింది. కాగా, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లోని కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఇదిలా ఉండగా పింకేశ్ కుమార్ స్థానంలో ఎవరికి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, విద్యాశాఖ అధికారి రెండు పోస్టులు ఖాళీగా మారాయి.
ఆయన హయాంలో జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు
కలెక్టర్, అదనపు కలెక్టర్‌లకు ఎమ్మెల్యే కడియంతో సహా పలువురి సత్కారం


