మీ పంచాయతీ సమాచారం...మీ చేతిలోనే!
● ‘మేరి పంచాయతీ’యాప్ ద్వారా
సమాచారం
పాలకుర్తి టౌన్: పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక గ్రామ పాలన బాధ్యత సర్పంచ్‌లు, వార్డు సభ్యులదే. పల్లెలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రూపాల్లో నిధులు మంజూరు చేస్తుంటాయి. వాటిని వేటికి ఖర్చు పెట్టాలి?.. ఏ అభివృద్ధి పనులు చేపట్టాలి.. తదితర వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఇక పాలకులదే. పలుచోట్ల నిధుల విషయంలో అక్రమాలు చోటు చేసుకునే అవకాశముంది. దీనికి అడ్డుకట్ట వేయడంతో పాటు పాలన పారదర్శకంగా సాగుతుందా? లేదా? అని తెలుసుకునేందకు కేంద్ర ప్రభుత్వం మేరి పంచాయత్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
యాప్‌లో ఏం ఉంటాయంటే..
స్మార్ట్ ఫోన్‌లోని ప్లేస్టోర్ ద్వారా మేరి పంచాయత్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. పేరు, ఫోన్ నంబర్ వివరాలతో లాగిన్ కావాలి. రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ వివరాలు నమోదు చేయాలి, వాటిని ఎంపిక చేసుకున్న తర్వాత క్లిక్ చేస్తే ఆ గ్రామానికి సంబంధించిన నిధుల వివరాలు, వార్డు వారీగా ఖర్చులు, చేపట్టిన పనుల ఫొటోలు కనిపిస్తాయి. గ్రామపంచాయతీకి మంజూరైన నిధులు, వాటితో చేపట్టిన పనుల వివరాలను ఫొటోలతో సహా అధికారులు విధిగా అప్‌లోడ్ చేస్తారు. ఆస్తులు, ఆదాయ వివరాలు, పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శి, అధికారుల వివరాలు జియోట్యాగింగ్ ద్వారా నిక్షిప్తమై ఉంటాయి. ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేపట్టారనేది తెలుసుకోవచ్చు.
ఫిర్యాదులు..సలహాలు
ఆర్థిక సంఘం ఎన్ని నిధులు విడుదల చేసింది. ఇంకా రావాల్సినవి ఎన్ని తదితర వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. దీంతో పాలకవర్గాలు పొరపాట్లకు తావివ్వకుండా ప్రతీ పైసా లెక్క ప్రకారం ఖర్చు చేసే అవకాశముంది. తప్పుడు లెక్కలు చూపితే పౌరులు ప్రశ్నించి సమాచారాన్ని రాబట్టి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. మరో వైపు గ్రామాభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు అందించే అవకాశం ఈ యాప్ ద్వారా పౌరులకు లభిస్తుంది.


