దండిగా ధాన్యసిరులు
సమష్టి కృషితోనే సాధ్యం
జనగామ: ధాన్యం కొనుగోలు ప్రక్రియ అనేది సవాళ్లతో నిండిన వ్యవస్థ. తేమ శాతం నుంచి తూకం, నిల్వ నుంచి చెల్లింపుల వరకూ అనేక దశల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయినా జిల్లాలో ఈ మొత్తం ప్రక్రియ సాఫీగా, సజావుగా, వేగవంతంగా సాగుతోంది. దీనికి ప్రధాన కారణం జిల్లా యంత్రాంగం చేపట్టిన సమగ్ర పర్యవేక్షణ, ఆధునిక సౌకర్యాల వినియోగం, సమస్యలను వెంటనే పరిష్కరించడమనే చెప్పవచ్చు. ఈ సారి ధాన్యం కొనుగోళ్లలో జిల్లాకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు మొదటి స్థానంలో నిలవడం గమనార్హం.
సెంటర్ల వారీగా ధాన్యం ఏ రోజు కొనుగోలు చేశారో అదేరోజు తూకం వేయించడం, వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయించడం, రైతుల ఖాతాల్లో డబ్బులను త్వరగా జమచేయడం వంటి చర్యలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. కొనుగోళ్లు ప్రారంభమైనప్పటి నుంచి మిల్లులకు ధాన్యాన్ని వెంటనే ట్యాగ్ చేసి పంపించడం, సంబంధిత వివరాలను ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో నమోదు చేయడం కూడా చెల్లింపుల వేగాన్ని పెంచింది. దీంతో రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా తమ ధాన్యానికి సమయానుకూలంగా నగదు అందుకుంటున్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాల మేరకు గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు ప్రతిరోజూ కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. స్థానిక ఇబ్బందులను పరిష్కరించి, ప్రక్రియ ఎటువంటి ఆటంకం లేకుండా సాగేలా కృషి చేస్తున్నారు. ఈ సమష్టి శ్రమతో ధాన్యం కొనుగోళ్లు జిల్లాలో ఆదర్శంగా నిలుస్తోంది.
జిల్లాలో ప్రస్తుత వానాకాలం 2025–26 సీజన్‌న్‌లో ఇప్పటివరకు 37,101 మంది రైతుల నుంచి 14,73,608 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి, రూ. 329.74 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశా రు. ఇది గత ఖరీఫ్ 2024–25 కంటే గణనీయంగా ఉంది. గత సీజన్‌న్‌లో 9,10,431 క్వింటాళ్లు కొనుగోలు చేసి మొత్తం రూ.211.21 కోట్లు చెల్లించినట్లు కలెక్టర్ వెల్లడించారు. అంతేకాక ఈ సీజన్‌న్‌లో సన్న ధాన్యం అమ్మిన రైతులకు అందించాల్సిన బోనస్ రూపంలో రూ.12.01 కోట్లు ఇప్పటికే జమ కాగా, పారదర్శకత, వేగం, అధికారుల సమీక్షలతో జిల్లా ప్రస్తుత ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర స్థాయిలో ప్రథ మ స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో కొనుగోళ్లు దాదాపు 5.63 లక్షల క్వింటాళ్ల మేర పెరిగింది.
– రిజ్వాన్ బాషా షేక్, కలెక్టర్, జనగామ
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో
జిల్లాకు ప్రథమ స్థానం
రైతన్నలకు అండగా జిల్లా యంత్రాంగం
నిరంతర పర్యవేక్షణ...గత రికార్డులకు బ్రేక్
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ నేతృత్వంలో ప్రత్యేక గుర్తింపు
రైతులు : 37,101
కొనుగోలు చేసిన ధాన్యం : 14,73,608
(క్వింటాళ్లలో )
జమ చేసిన నగదు : రూ.329.74 కోట్లు
సన్న ధాన్యం బోనస్ జమ : రూ.12.01 కోట్లు
ప్రస్తుత సీజన్‌లో సన్న ధాన్యం అమ్మిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ మొత్తంగా రూ.12.01 కోట్లు జమ చేశాం. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో జిల్లా తొలి స్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. కొనుగోళ్ల సమయంలో జాప్యం లేకుండా, రోజువారీ అప్డేట్‌లు, వేగవంతమైన చెల్లింపులు అన్నీ కలసే ఈ సక్సెస్. ఇతర జిల్లాలు కూడా జనగామ నమూనాను అనుసరించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అధికారులు, సిబ్బంది, మిల్లర్లు సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. రైతులు తమ ధాన్యానికి సమయానుకూలంగా, పారదర్శకంగా చెల్లింపులు అందుకోవడంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దండిగా ధాన్యసిరులు


