యేసయ్య ఆరాధనలో..
క్రిస్మస్ పండుగకు ఏర్పాట్లు పూర్తి
● అర్ధరాత్రి యేసురాకను స్వాగతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు
● విద్యుత్ వెలుగుల్లో చర్చిలు, క్రైస్తవుల ఇళ్లు
జనగామ: జిల్లాలో క్రిస్మస్ పండుగ వాతావరణం నెలకొంది. ఈనెల 25న (గురువారం) జరగనున్న క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రైస్తవ సోదరులు సంబురాల్లో మునిగిపోయారు. ప్రధాన కూడళ్లలో ఆకర్షణీయమైన నక్షత్రాలతో వెలుగుల హరివిల్లు కట్టారు. చర్చి ప్రాంగణాల్లో యేసు జననాన్ని ప్రతిబింబించే పశువులపాక నమూనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి యేసురాకను స్వాగతిస్తూ క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు ఆలపించారు. క్రైస్తవ యువత ఆనందోత్సాహాల నడుమ వేడుకల్లో భాగస్వామ్యులయ్యారు. మానవాళి కోసం శిలువపై ప్రాణత్యాగం చేసిన యేసు ప్రభువు ప్రేమ, కరుణను స్మరించుకుంటూ భక్తులు ప్రార్థనల్లో నిమగ్నమయ్యారు.
క్రిస్మస్ ట్రీ ప్రత్యేకత
క్రిస్మస్ ట్రీని మొదటిసారిగా 1510లో క్రిస్మస్ రోజు జర్మనీలో లాటివియా అనే ప్రాంతంలోని ‘దిగా’ అనే గ్రామంలో తొలిసారిగా ఏర్పాటు చేసినట్టు చరిత్ర చెబుతోంది. వీటి కోసం తొలత ‘కీనిఫిర్లు పైన్, ఫిర్ స్రూసీ’ తదితర జాతుల చెట్లను అప్పట్లో వినియోగించేవారు. మధ్యయుగంనాటి నాటికల్లో క్రిస్మస్ ట్రీ స్వర్గం నుంచి వచ్చిందని పేర్కొంటూ ‘ట్రీ ఆఫ్ ప్యారడైజ్’గా అభివర్ణించారు. ఆరు లేదా ఏడడుగుల మొక్కలను క్రిస్మస్ ట్రీకి ఉపయోగించడం ఆనవాయితీ. 1782లో థామస్ అల్వా ఎడిసన్ సహాయకుడు ఎడ్వర్డు జాన్సన్ తొలిసారిగా క్రిస్మస్ ట్రీని విద్యుత్ దీపాలతో అలంకరించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు.
యేసు ప్రభువు రాకకోసం
క్రీస్తును నమ్మిన వారికి ఇదొక శుభదినం. ప్రభువు రాకకోసం క్రిస్మస్‌కు నెల ముందు నుంచే క్రీస్తు విశ్వాసులు సమాయత్తం అవుతారు. రక్షకుడిగా, మానవాళి పాప విమోచకుడిగా, మరణాన్ని గెలిచిన మహరాజుగా ఈ లోకంలో జన్మించిన యేసుక్రీస్తు జన్మదినాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకునేందుకు ముందు నుంచే ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రిస్మస్ అన్ని వర్గాల వారికి శాంతి, సమాధానం, ప్రేమ పంచాలి. ఒక్కరోజు ముందుగానే అన్ని చర్చిల్లో పండుగ వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన చర్చిలతో పాటు ఆయా కాలనీల్లో అర్థరాత్రి యేసు ప్రభువు రాకను పురస్కరించుకుని ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు. గురువారం ఉదయం వందలాది మంది సేవకులు ప్రార్థనా మందిరాలకు చేరుకుని దేవున్ని ఆరాధిస్తారు.
పట్టణంలోని ధర్మకంచ బేతెల్ బాప్టిస్టు చర్చిలో కేక్ కట్ చేస్తున్న క్రైస్తవులు


