కులం పేరుతో దూషిస్తే కఠిన చర్యలు
బచ్చన్నపేట: కులం పేరుతో ఎవరినీ దూషించొద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ హెచ్చరించారు. బుధవారం మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై విచారణ జరిపారు. అలాగే సాల్వాపూర్‌లో అత్తింటి వరకట్న వేధింపులకు వివాహిత ఆత్మహత్య చేసుకోగా ఆ అత్తింటి వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. గ్రామంలో మాజీ సర్పంచ్ భర్త తాతిరెడ్డి శశిధర్‌రెడ్డి అదే గ్రామానికి చెందిన దళితులను ఈ నెల 16న తిట్టారని పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో విచారణ చేసి వివరాలను నమోదు చేసుకున్నామని వాటిని పైఅధికారులకు తెలియజేస్తామని తెలిపారు. అలాగే సాల్వాపూర్‌లో అనుశ్రీ అనే వివాహిత వరకట్న వేధింపులకు ఆత్మహత్య చేసుకోగా అందుకు కారణమైన అత్త, మామ, భర్త, మరొకరు మొత్తం నలుగురిని అరెస్టు చేశామన్నారు. గ్రామాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో నర్మెట సీఐ అబ్బయ్య, ఎస్సై ఎస్‌కే అబ్దుల్ హమీద్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్


