ముగిసిన పాలిటెక్నిక్ కళాశాలల క్రీడాపోటీలు
స్టేషన్‌ఘన్‌పూర్: మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లాస్థాయి పాలిటెక్నిక్ కళాశాలల క్రీడాపోటీలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా సాయంత్రం ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో వివిధ పోటీలలో విజేతలైన కళాశాలల జట్లకు బహుమతులు అందించారు. ముఖ్య అతిఽథి, కళాశాల ప్రిన్సిపాల్ పోచయ్య మాట్లాడుతూ.. ఓటమిచెందిన వారు నిరాశచెందకుండా వారిలోని క్రీడాప్రతిభను మరింతగా మెరుగుపర్చుకోవాలన్నారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ కళాశాలల నుంచి 540 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. ఓవరాల్ చాంపియన్‌గా బాలుర, బాలికలలో వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిలిచిందన్నారు. అదేవిధంగా వ్యక్తిగతంగా బాలుర ఓవరాల్ చాంపియన్‌గా ఘన్‌పూర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి బి.అశోక్, బాలికల విభాగంలో వరంగల్ జీపీటీ విద్యార్థిని జి.నీల నిలిచారన్నారు. కార్యక్రమంలో వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్, పీడీ రాజుతో పాటు పీడీలు, పీఈటీలు, అధ్యాపకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.


