ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
● 28, 29వ తేదీల్లో రాష్ట్ర విద్యాసదస్సు,
విస్తృత సమావేశాలు
● టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవి
జనగామ రూరల్: ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే జాతీయస్థాయి ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నామని, ఉపాధ్యాయులకు భారమవుతున్న బోధనేతర పనులకు దూరంగా ఉంచాలని, తక్షణం 15వేల కోట్లు విడుదల చేయాలని టీఎస్ యూటీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అన్నారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖరరావు అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని స్టేషన్ రోడ్ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల జిల్లా కేంద్రంలో 28 29 తేదీలలో జరిగే విద్యాసదస్సు, రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలకు ఉపాధ్యాయులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రారంభ సభలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి సీతక్క, కొండా సురేఖ, పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్, ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్, మడూరి వెంకటేశ్, ఆకుల శ్రీనివాస రావు, కోశాధికారి చిక్కుడు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు కందుల శ్రీనివాస్ ,గూడెల్లి కృష్ణ, ఎం కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


