విధుల్లో నిర్లక్ష్యం వద్దు
● టీజీఎన్‌పీడీసీఎల్ (సీజీఆర్‌ఎఫ్–1)
చైర్మన్ ఎన్.వేణుగోపాలచారి
నర్మెట: విధుల్లో నిర్లక్ష్యం తగదని, విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి సిబ్బంది కృషిచేయాలని టీజీఎన్‌పీడీసీఎల్ (సీజీఆర్‌ఎఫ్–1) చైర్మన్ ఎన్.వేణుగోపాలాచారి సూచించారు. స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న ఆయన వినతి పత్రాలను స్వీకరించి వెంటనే తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రఘునాథపల్లి, నర్మెట, తరిగొప్పుల మండలాలకు చెందిన పలువురు రైతులు, వినియోగదారులు పాల్గొని మిడిల్ పోల్స్, డీటీఆర్స్‌ను సరిచేయడం, లైన్లను, ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను మార్చాలని 14 వినతి పత్రాలు అందజేశారు. అనంతరం సిబ్బందితో కలసి ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట టెక్నికల్ మెంబర్ కె.రమేశ్, ఫైనాన్స్ మెంబర్ ఎన్.దేవేందర్, సభ్యుడు ఎం.రామారావు, ఎస్‌ఈ సంపత్‌రెడ్డి, ఎస్‌ఏఓ సుదర్శన్ రావు , డీఈ లక్ష్మినారాయణ, ఏడీఈలు తదితరులు ఉన్నారు.


