
1962 అంబులెన్స్ , ఆవు, గొర్రె
ఆరునెలలుగా అందని మందులు
‘ప్రైవేట్’లో కొనుగోలు చేయడంతో పాడి రైతులపై ఆర్థికభారం
శస్త్ర చికిత్సలకూ మంగళం
1962 అంబులెన్స్ నిర్వహణపై ఆందోళన
జనగామ: పశువులు తీవ్ర అనారోగ్యానికి గురై కదలలేని పరిస్థితిలో గ్రామాలకు వెళ్లి వైద్యసేవలు అందించే 1962 అంబులెన్స్ సంచార పశు వైద్యశాలకు గ్రహణం పట్టింది. రైతులకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ నాటి పాలక ప్రభుత్వం ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. గేదె, దుక్కిటెద్దు, గొర్రెలు, మేకలు అనారోగ్యానికి గురైన సమయంలో ఈ నంబర్‌కు ఒక్క ఫోన్ కొడితే చాలు, అంబులెన్స్ ఇంటి ముందుకు వచ్చి వాలిపోతుంది. మూగ జీవి ఆరోగ్య నిర్ధారణను బట్టి వెటర్నరీ వైద్యుడు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇచ్చి వెళ్లే పరిస్థితి. ఇప్పుడు ఆ సేవలు కనిపించడం లేదు. నిధుల కొరత పేరిట 1962 అంబులెన్స్ నిర్వహణ గాలిలో దీపంలా మారగా, ఉచిత మందులకు మంగళం పాడేశారు. డాక్టర్ వెళ్లి పశువులకు అవసరమైన మందులకు సంబంధించి చీటీ రాసిస్తే, రైతులు సొంత డబ్బులతో ప్రైవేట్ దుకాణంలో కొనుగోలు చేసుకుంటున్నారు. దీంతో పాడి రైతులకు ఆర్థిక భారం పడుతుంది.
జిల్లాలో మూడు అంబులెన్స్‌లు
జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మూడు 1962 సంచార పశువైద్యశాలలు ఉన్నాయి. ఇవి మారుమూల గ్రామాల్లోని రైతుల వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి పశువులకు వైద్య సేవలు అందిస్తున్నాయి. దీంతో రైతులు పాడి సంపదను మరింత పెంపొందించుకోవడంతో పాటు ఆర్థికంగా లాభపడుతున్నారు. కానీ ఆరు నెలలుగా సంచార పశు వైద్యశాల అంబులెన్స్‌లకు మందుల సరఫరా నిలిపేశారు. జిల్లాలో 8.76 లక్షల పశువులు, మేకలు, గొర్రెలు ఉండగా, ప్రతీ నెల వెయ్యి నుంచి 3 వేల మూగ జీవాలకు అంబులెన్స్‌తో పాటు వెటర్నరీ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు అందిస్తున్నారు. 1962 అంబులెన్స్ ద్వారా జ్వరం, ఎదకు రావడం, గాయాలు, కీళ్ల నొప్పులు, కాల్షియం తగ్గడం, అవసరమైన మేర శస్త్ర, వైద్య సేవలను అందిస్తారు. శస్త్ర చికిత్సలు ఏడాది క్రితమే నిలిచిపోగా, ఆరు నెలల నుంచి మందులు కూడా అందుబాటులో లేక రైతులు ప్రైవేటులో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఉచితంగా మందులు అందించి, శస్త్ర చికిత్సలను సైతం తిరిగి ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
మందుల కొరత
జిల్లాలో 4 ఏరియా (జనగామ, బచ్చన్నపేట, తిమ్మంపేట, కొడకండ్ల) ఆస్పత్రులుండగా, 23 ప్రాథమిక, 20 పశు వైద్యశాల సబ్ సెంటర్లు మూగ జీవాలకు సేవలు అందిస్తున్నాయి. ప్రాథమిక స్థాయిలో వైద్య పరీక్షలు చేసి మందులు ఇస్తుండగా, ఆపరేషన్లు, ఖరీదైన మందు గోలీలు మాత్రం ప్రైవేట్‌లో కొనుగోలు చేసే పరిస్థితి నెలకొంది.
1962 అంబులెన్సులు 3
మేకలు 1,03,658
వెటర్నరీ ఏరియా ఆస్పత్రులు 4
ప్రాథమిక ఆస్పత్రులు 23
గొర్రెలు 5,24,328
నల్ల పశువులు 75,029
సబ్ సెంటర్లు 20
తెల్ల పశువులు 73,482
మందుల సరఫరా లేదు
కొన్ని నెలలుగా మెడిసిన్ ఇండెంట్ రావడం లేదు. మూడు నెలల నుంచి వందశాతం అందుబాటులో లేవు. తమకు రైతు నుంచి ఫోన్‌కాల్ వచ్చిన వెంటనే పశువులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వాటిని పరీక్షించి మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం మా వద్ద స్టాక్ లేకపోవడంతో రైతులకే ప్రిస్క్రిప్షన్ చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం స్పందించి 1962 సంచార పశువైద్యశాలకు మెడిసిన్ సరఫరా చేయాలి. సిబ్బందికి వేతనాలు క్రమం తప్పకుండా చెల్లించాలి. – డాక్టర్ విజయకుమార్, 1962 సంచార పశువైద్యశాల, జనగామ