
పాఠశాలలకు 5స్టార్ రేటింగ్!
జనగామ: స్వచ్ఛత–హరిత లక్ష్య సాధనలో దేశంలోని పాఠశాలల అభివృద్ధి ఎలా ఉందనే విషయం తెలుసుకునేందుకు కేంద్ర విద్యా, అక్షరాస్యత శాఖ స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ (ఎస్‌హెచ్‌వీఆర్) 2025–26 అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో ఉన్న స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ (ఎస్‌వీపీ)ను సవరించి ఎస్‌హెచ్‌వీఆర్ 2025–26ను ప్రవేశ పెట్టారు. పాఠశాలల్లో సుస్థిర పద్ధతులను నెలకొల్పడం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్ధేశ్యం. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై 29న కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో అఖిల భారతీయ శిక్షా సమాగం వేడుకల్లో ఎస్‌హెచ్‌వీఆర్ అనే మదింపు విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ విధానం ద్వారా పాఠశాలల స్థాయిని నిర్ధారించి 5 స్టార్ల రేటింగ్ ఇస్తారు. దేశంలోని అన్ని పాఠశాలలు ఆన్‌లైన్‌లో పాఠశాల స్థితిగతులను తెలుపుతూ 2025 సెప్టెంబర్ 30వ తేదీ నాటికి రేటింగ్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. యూడైస్ కోడ్ ఉన్న అన్ని పాఠశాలలు (ప్రభుత్వ, ప్రభుత్వ–సహాయక, ప్రైవేట్, వివిధ గురుకుల సంక్షేమ, కేంద్రియ విద్యాలయాలు, నవోదయ విద్యాసంస్థలు వంటి కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు) ఈ రేటింగ్‌లో పాల్గొనవచ్చు.
పరిశుభ్రత, పచ్చదనం
సమ్మిళితమైన బోధనాభ్యసన విధానాల పరంగా పాఠశాల విద్యావ్యవస్థ పటిష్టంగా ఉండడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయి. విద్యార్థుల సమగ్ర మానసిక వికాసంతో పాటు మంచి ఆరోగ్య నడవడికకు తోడ్పడుతూ వారి అభ్యసన స్థాయిలను మెరుగుపరుస్తాయి.
ఎస్‌హెచ్‌వీఆర్ లక్ష్యాలు
విద్యార్థుల ఆరోగ్యం, పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పేందుకు ఇది ఉపయోపడుతుంది. విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయుల్లో స్థిరమైన పర్యావరణ పద్ధతులపై అవగాహనను పెంపొందించడం, సామర్థ్యాలతో సంబంధం లేకుండా, పిల్లలందరికీ సమ్మిళిత, సురక్షితమైన బోధనాభ్యాసన వాతావరణాన్ని సృష్టించడంలో కీలకంగా ఉపకరిస్తుంది.
60 కేటగిరీల్లో సూచిక సర్వే
పాఠశాలలు ఆరు కీలక రంగాల ఆధారంగా మూల్యాంకనం చేయబడతాయి. ఇందులో నీరు లభ్యత, మరుగుదొడ్ల పరిశుభ్రత నిర్వహణ, సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం, అందుకు సౌకర్యాల కల్పన, పాఠశాల మౌలిక సదుపాయాలు, స్వచ్ఛత, సామర్థ్య నిర్మాణంపై అవగాహన కార్యక్రమాలు, మిషన్ లైఫ్ కార్యకలాపాలు, పర్యావరణ స్థిరత్వ కార్యక్రమాలపై సర్వే చేపడతారు. మెరుగైన మదింపు సాధనాలు, సరళీకృత ప్రశ్నపత్రాలు, ఎన్‌సీఈఆర్‌టీ, ఎన్‌ఐసీ, యూఎన్‌ఐసీఈఎఫ్ అభివృద్ధి చేసిన ఆధునిక సమాచార పరిజ్ఞానంతో ఎస్‌హెచ్‌వీఆర్ రేటింగ్‌ను నిర్ధారిస్తుంది. పాఠశాలల పనితీరు, గుర్తింపు, రేటింగ్ ఆధారంగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మెరిట్ సర్టిఫికెట్‌లను అందిస్తారు.
జిల్లా స్థాయిలో..
జిల్లా స్థాయిలో 4 వర్గాల పాఠశాలలను గుర్తించి మెరిట్ సర్టిఫికెట్‌ను అందజేస్తారు. గ్రామీణ వర్గం–1, 2లో 6, పట్టణ వర్గం– 1, 2 లో 2 పాఠశాలను గుర్తించి (మొత్తం 8) 5 స్టార్ రేటింగ్ ఇవ్వనున్నారు. వీటిని రాష్ట్ర స్థాయి గుర్తింపు కోసం నామినేషన్‌కు అర్హత పొందుతాయి. రాష్ట్ర స్థాయిలో మొత్తం స్కోరు ఆధారంగా రేటింగ్ నిర్ధారించి మెరిట్ సర్టిఫికెట్ ఇస్తారు. పాఠశాలలు ఎస్‌హెచ్‌వీఆర్.ఎడ్యుకేషన్, జీఓవీ.ఇన్ ప్రత్యేక పోర్టల్ లేదా ఎస్‌హెచ్‌వీఆర్ మొబైల్ యాప్‌లో సమాచారాన్ని నింపి పోటీల్లో పాల్గొనవచ్చు.
ప్రతీఒక్కరు భాగస్వాములు కావాలి
గతంలో ఉన్న స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ (ఎస్‌వీపీ)ను సవరించి ఎస్‌హెచ్‌వీఆర్ 2025–26ను ప్రవేశ పెట్టారు. పాఠశాలల్లో సుస్థిర పద్ధతులను నెలకొల్పడం, కొనసాగించడం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. కలెక్టర్, అదనపు కలెక్టర్ల చొరవతో పాఠశాలలు విద్య, మౌలిక వసతుల పరంగా ఉన్నత స్థాయిలో నిలుస్తున్నాయి. హెచ్‌ఎంలు ఎస్‌హెచ్‌వీఆర్ యాప్ ద్వారా ఇందులో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
– బొమ్మనబోయిన శ్రీనివాస్, ఏఎంఓ
స్వచ్ఛత, హరిత విద్యాలయాలకు ప్రాధాన్యం
‘యూడైస్’ ఉన్న ప్రతీ స్కూల్‌కు అవకాశం
సెప్టెంబర్ 30 వరకు చివరి అవకాశం

పాఠశాలలకు 5స్టార్ రేటింగ్!