
ఆగిన టీచర్ల సర్దుబాటు!
జనగామ: జిల్లాలో 109 మంది ప్రభుత్వ టీచర్ల సర్దుబాటు ప్రక్రియకు బ్రేక్ పడింది. సర్దుబాటు లోపాయి కారి ఒ ప్పందాలపై ‘సాక్షి’ వరుస కథనాలు విద్యాశాఖ ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై పునరాలోచనలో పడిన అధికారులు తలలు పట్టుకున్నారు. ఇదే క్రమంలో టీపీటీఎఫ్ సంఘ ప్రతినిధులు సైతం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఉపాధ్యాయుల సర్దుబాటులో జరిగిన అవకతవకలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి.
సర్దుబాటులో విద్యార్థుల సంఖ్యను పట్టించుకోకుండా పైరవీలు, లోపాయికారి ఒప్పందాలతో తమ పిల్లల భవిష్యత్‌ను ఆగం చేస్తున్నారని తల్లిదండ్రులు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. విద్యాబుద్ధులు చెప్పే దేవాలయం లాంటి బడిలో పైరవీలు ఏంటని తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. ‘సాక్షి’ వరుస కథనాల నేపధ్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పింకేష్ కుమార్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. సర్దుబాటుపై ఇప్పుడే తొండరపడొద్దని, ఉపాధ్యాయుల పదోన్నతి ప్రక్రియ పూర్తయిన తర్వాతనే సర్దుబాటు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా విద్యాశాఖ అధికారుల సూచన మేరకు చాలా మంది టీచర్లు రిలీవ్ కాలేదని, అంతకు మందు మాత్రం కొద్ది మంది టీచర్లు రిలీవ్ అయ్యారు.

ఆగిన టీచర్ల సర్దుబాటు!