
‘భూభారతి’తో భూసమస్యల పరిష్కారం
దేవరుప్పుల : భూభారతి చట్టంతో అపరిష్కృతంగా ఉన్న భూసమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంఎన్‌ఆర్ గార్డెన్‌లో తహసీల్దార్ ఆడెపు ఆండాలు అధ్యక్షతన ‘భూభారతి చట్టం–రైతుల చుట్టం’ అనే అంశంపై ఏర్పాటు చేసిన అవగా హన సదస్సులో ఆయన మాట్లాడారు. జఠిలమైన భూసమస్యల పరిష్కారానికి కొత్తచట్టం కార్యరూ పం దాల్చిందని, నాలుగంచెల వ్యవస్థతో భూయజమానులకు సానుకూలంగా ఉందని చెప్పారు. క్షేత్రస్థాయిలో తొలుత తహసీల్దార్, మలి విడత ఆర్డీఓ, ఆ తర్వాత కలెక్టర్ ద్వారా న్యాయం చేకూరలేదంటే అప్పీల్ వ్యవస్థను కీలకంగా వినియోగించు కోవచ్చని పేర్కొన్నారు. గతంతో పోల్చుకుంటే భూరికార్డుల తప్పుల సవరణ, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, వారసత్వం తదితర మార్గాల ద్వారా సాదా బైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టడానికి మార్గదర్శకాలు వచ్చాయని చెప్పా రు. గ్రామ పాలన అధికారుల పర్యవేక్షణలో ఏడాది కోసారి ఆయా గ్రామాల్లోనే భూరికార్డులు భద్రపర్చి ఉంచుతారని, తద్వారా కొనుగోలు చేసే వారికి క్లియరెన్స్ లభిస్తుందని వివరించారు. త్వరలో డిజిటల్ సర్వే ఆధారంగా నివాసిత ప్లాట్ల మాదిరి వ్యవసాయ భూముల వద్ద ఫొటోలు దిగి సరైన హద్దులతో కూడిన చిత్రపటం వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పట్టాదారు పుస్తకం ఉండి కబ్జాలో లేని.. కబ్జాలో ఉండి పట్టాదారు పుస్తకం లేని రైతులకు సముచిత న్యాయం చేయడానికి అధికార యంత్రాంగం పరిశీలిస్తుందన్నారు. జూన్ నుంచి ఊరూరా భూసమస్యలపై గ్రామ సభల్లోనే ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పారు. సదస్సులో మండల ప్రత్యేక అధికారి శ్రీధర్‌రావు, నాయబ్ తహసీల్దార్ లచ్చునాయక్, ఎంపీడీఓ కె.లక్ష్మీనారాయణ, రెవెన్యూ జిల్లా సిబ్బంది శ్రీనివాస్, వ్యవసాయ శాఖ ఏడీఓ పరశురాంనాయక్, ఏఓ దివ్య, ఎంపీఓ సురేష్‌కుమార్, ఆర్‌ఐ రాజు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం ఎగుమతి సత్వరమే చేపట్టాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసిన నిల్వ ల ఎగుమతి సత్వరమే చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. సోమవారం దేవరుప్పుల మండల పరిధి సింగరాజుల్ల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఆయన రికార్డులను పరిశీలించి కల్లాల్లో ధాన్యం దిగుమతి, ఎగుమతి వివరాలు తెలుసుకున్నారు. హమాలీల కొరత లేకుండా యుద్ధప్రాతిపదికన కాంటాలు పెట్టి ధాన్యాన్ని సకాలంలో రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సహకారం సంఘం సీఈఓ కృష్ణమూర్తిని ఆదేశించారు. అకాల వర్షాల నేపథ్యంలో నిర్వాహకులతో పాటు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా