
‘భూ భారతి’తో సమస్యల పరిష్కారం
నర్మెట/తరిగొప్పుల: ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యల పరిష్కారం సులభతరం కానుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం నర్మెట, తరిగొప్పుల మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ధరణీలో పరిష్కారం కాని పలు సమస్యలకు భూ భారతిలో పరిష్కారం చూపబడిందని, దరఖాస్తుల స్వీకరణకు ఏడాదికాలం (2026 ఏప్రిల్ 14వ తేదీ) వరకు సమయం ఉందన్నారు. క్రయవిక్రయాల్లో హిస్టరీ ఆఫ్ డాక్యుమెంట్స్‌తోపాటు భూమికి సంబంధించిన నక్షా జత పరచడం జరుగుతుందన్నారు. ఎవరైనా మోసపూరిత రికార్డులను మార్చినా అలాంటివి రద్దు చేసే అధికారం ఈ చట్టానికి ఉందన్నారు. గతంలో మాదిరిగా వీఆర్‌ఓల స్థానంలో గ్రామపాలన అధికారిని నియమించి భూ క్రయవిక్రయాలు నమోదు చేసి రికార్డులు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ రోహిత్ సింగ్, ఎస్‌డీసీ సుహాసిని, ఆర్డీఓ గోపిరాం, ఎంపీడీఓలు అరవింద్ చౌదరి, దేవేందర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా