కూల్చిన భవనాల మట్టితో చెరువు పూడ్చివేత
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ప్లాట్ల అమ్మకాలు
సమీప కాలనీలకు పొంచి ఉన్న ప్రమాదం
మరికొద్ది రోజుల్లో తన ఉనికిని కోల్పోతా నేమోనని.. రంగప్ప చెరువు చెమ్మగిల్లుతోంది. సమీప కాలనీల ప్రజలకు ముప్పు ముంచుకొస్తోంది. పట్టణంలో కూల్చిన భవనాల మట్టితో చెరువును పూడ్చే పనులు శరవేగంగా సాగుతున్నాయి. రోజురోజుకూ చెరువు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్లలో ప్లాట్ల అమ్మకాలకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
– జనగామ
హద్దురాళ్ల తొలగింపు..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చెరువుల అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల కబ్జాలపై ఉక్కుపాదం మోపింది. ప్రత్యేకంగా హైడ్రాను ఏర్పాటు చేసి, ఎఫ్‌టీఎల్ నిర్మాణాల్ని కూల్చేయడంతో రంగప్ప చెరువులో ప్లాట్ల అమ్మకాలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అందులో ప్లాట్ అంటేనే వెనకడుగు వేసే పరిస్థితికి వెళ్లింది. ఏడాది పాటు స్తబ్ధంగా ఉన్న రంగప్ప చెరువు ప్లాట్ల అమ్మకాలు మళ్లీ మొదలయ్యాయి. ఇటీవల ఇళ్ల కూల్చివేత మట్టిని వందలాది ట్రాక్టర్లలో రంగప్ప చెరువుకు తరలిస్తున్నారు. గతంలో చెరువు పరిధిలో ఏర్పాటు చేసిన ఎఫ్‌టీఎల్ హద్దురాళ్లను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించి, డోజర్లతో మొక్కలను క్లీన్ చేయిస్తున్నారు. భారీ వర్షాలొస్తే జనావాసాల్లోకి నీరు వస్తుందని జనగామ ప్రజలకు టెన్షన్ పట్టుకుంది.
సమీప కాలనీల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ట్రాక్టర్లతో మట్టిని పోస్తున్న వారిని నిలదీస్తే బెదిరింపులకు దిగుతున్నట్లు కాలనీలవాసులు చెబుతున్నారు. కలెక్టర్ నివాసముండే ప్రాంతంలో ఓ చెరువును మాయం చేయాలని చూస్తున్నా.. కబ్జా కోరుల వెనుక ఉండి నడిపించే శక్తి ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. ఇటీవల కాలనీకి చెందిన పలువురు కలెక్టర్, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప ట్టణంలో కూల్చేసిన ఇంటి మట్టిని తీసుకొచ్చి చెరువులో నింపేస్తున్నట్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
జనగామ పట్టణ నడిబొడ్డున ఉన్న రంగప్ప చెరువుకు ముప్పు ముంచుకొస్తోంది. గతంలో ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లోని ప్లాట్ల అమ్మకాలతో చెరువు మాయం కాగా... నేడు పట్టణంలో కూల్చేసిన భవనాల మట్టితో చెరువును పూడ్చేస్తున్నారు. చెరువు కబ్జాకు గురి కాకుండా.. అప్పటి ఇరిగేషన్ అధికారుల నివేదికతో ఆక్ర మణదారులపై అప్పటి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఉక్కుపాదం మోపారు.
ఎఫ్‌టీఎల్ హద్దులు ఏర్పాటు చేసి.. పాట్ల క్రయవిక్రయాలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. మూడేళ్ల తర్వాత చెరువులోని ప్లాట్ల విక్రయాల్లో మళ్లీ కదలిక మొ దలైంది. ఎఫ్‌టీఎల్ పరిధిని ఆక్రమించి, ప్లాట్లను విక్రయించినట్లు గుర్తించిన ఇరిగేషన్ అధికారులు సదరు యజమానులకు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. హైడ్రా తర్వాత క్రయవిక్రయాలు బ్రేక్ పడ్డాయి. కానీ.. కొందరు అడ్డదారిలో అమ్మకాలకు పావులు కదుపుతున్నారు.