ల్యాబ్ టెక్నీషియన్లు వచ్చేశారు!
జనగామ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్–2) పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో బోధన ఆసుపత్రులతో పాటు జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో ఖాళీలను యాదాద్రి జోన్ పరిధిలో భర్తీ చేశారు. గత శుక్రవారం ప్రజారోగ్య సంచాలక విభాగం కౌన్సి లింగ్ షెడ్యూల్‌ను ఖరారు చేయగా, ప్రస్తుతం అవుట్‌సోర్సింగ్, ఒప్పంద పద్ధతిలో ప్రభుత్వ దవాఖానాల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లను రెగ్యులర్ చేసే క్రమంలో నియామక ప్రక్రియలో 20 మార్కుల వెయిటేజీ కల్పించారు.
42 పోస్టులు..38 మంది నియామకం
జిల్లాకు 42 గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ఖాళీలను భర్తీ చేశారు. ఇప్పటివరకు దశాబ్దాల కాలం నుంచి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు పర్మినెంట్ అయ్యారు. ఇందులో మెడికల్ కాలేజీ, జిల్లా ఆసుపత్రులకు 29, సీహెచ్‌సీలకు 5, పీహెచ్‌సీలకు 11 పో స్టులను కేటాయించారు. స్థానిక నియామకాల్లో జనగామ జిల్లాకు చెందిన కసాబు రాజేశ్, తాళ్ల భానుచందర్, బత్తిని సంపత్, కడవేరుకు విశ్వనాథ్, వని త, కుమారస్వామి, వేణు, ఉదయ్, వెంకట్, నీలి కాంత్ ఎంపికయ్యారు. జిల్లాకు చెందిన పది మంది టెక్నీషియన్లు పోస్టులు పొందగా, నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాలకు చెందిన 32 మంది జనగామ జిల్లా పరిధికి ఎంపిక కాగా, మంగళవారం నుంచి సేవలందించనున్నారు. ప్రస్తుతం 38 మందికి నియామక పత్రాలు అందించగా, మరో నలుగురికి ఆర్డర్ కాపీలు అందించాల్సి ఉంది.
62 మందికి పైగా..
జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్ల సంఖ్య కొత్త వారితో కలుపుకుని సుమారు 62కు పైగా చేరింది. దీంతో ప్రజారోగ్యంలో సేవలు మరింత పెరగనున్నాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల ప్రజలకు రక్తపరీక్షల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం తగ్గి, ఖర్చు తగ్గడంతో పాటు సమయం ఆదా కానుంది. ఈ నియామక ధ్రువపత్రాలను హైదరాబాద్ కోఠిలోని వైద్య విద్య సంచాలకుల కార్యాలయంలో హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్, వైద్య విధాన పరిషత్ కమిషనర్, డాక్టర్ అశోక్ కుమార్ చేతుల మీదుగా అభ్యర్థులు సోమవారం అందుకున్నారు. కొత్తగా చేరిన సిబ్బంది రానున్న రోజుల్లో ప్రజారోగ్య సేవలను మరింత బలోపేతం చేయనున్నారని అధికారులు వెల్లడించారు.
రెండు దశాబ్దాలుగా కాంట్రాక్టు పద్ధతిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నా. మా సేవలను గుర్తించి రెగ్యులర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ప్రభుత్వ దవాఖానాల్లో రక్త పరీక్షలకు సంబంధించి ప్రజలకు మరింత నమ్మకం, విశ్వాసం కలిగేలా విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తాం.
– కసాబు రాజేశ్, ల్యాబ్ టెక్నీషియన్
జనగామకు 42 పోస్టులు..
38 మందికి నియామక పత్రాలు
అందజేత
డీహెచ్, మెడికల్, సీహెచ్‌సీ,
పీహెచ్‌సీలకు కేటాయింపులు
ప్రజారోగ్య సేవలకు మరింత బలం
ల్యాబ్ టెక్నీషియన్లు వచ్చేశారు!


